హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు!
కేసీఆర్ను దోషిగా చూపేందుకే రేవంత్ కుట్ర
కాళేశ్వరంపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
కాకతీయ, రాజన్న సిరిసిల్ల: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ సర్కారుకు చెంపపెట్టు వంటిదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి విమర్శించారు. గురువారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో విస్తృత చర్చలు జరిపిన తర్వాతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, గోదావరి జలాల వినియోగం కోసమే మేడిగడ్డ బ్యారేజీని గత ప్రభుత్వం నిర్మించిందని స్పష్టం చేశారు.
కుట్రలకు స్వస్తి పలకాలి
కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ మాత్రమే కాదని, అందులో వందకు పైగా కాంపోనెంట్స్ ఉన్నాయని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచస్థాయి సంస్థ ఎల్ అండ్ టీ మేడిగడ్డను నిర్మించిన విషయాన్ని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును పెంచకపోవడం రేవంత్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. కేసీఆర్ను దోషిగా నిలబెట్టాలనే కుట్రలో భాగంగానే ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
హైడ్రాపై విమర్శలు
ప్రభుత్వం ‘హైడ్రా’ పేరుతో ధనవంతుల ఆక్రమణలను వదిలేసి, పేదవారి ఇళ్లను కూలుస్తోందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి కుట్ర రాజకీయాలు మానుకొని, మేడిగడ్డ బ్యారేజీని ప్రజలకు ఉపయోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సిరిసిల్లను అగ్రగామిగా నిలిపేందుకు కేటీఆర్ ఎంతో కృషి చేశారని, తెలంగాణ భవిష్యత్తు కేసీఆర్ నాయకత్వంలోనే సురక్షితంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

