ప్రభుత్వ నిర్లక్ష్యం… బలైన నిండు ప్రాణం..!
శంకర్ గౌడ్ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి: మూనావత్ నరసింహ నాయక్
ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి : పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
రోడ్డెక్కిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు…హోరెత్తిన నినాదాలు
రాయపర్తిలో వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారిపై గులాబీ దళం ధర్నా
కాకతీయ, రాయపర్తి :ఆర్టీసీ కార్మికుడు కోల శంకర్ గౌడ్ మృతితో రాయపర్తి మండల కేంద్రంలో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి.శుక్రవారం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారి రాజీవ్ చౌరస్తాలో భైఠాయించి ప్రభుత్వ మొండి వైఖరిని ఎండగట్టారు.శంకర్ గౌడ్ అమరహే.. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి.. అంటూ ఆ పార్టీ నాయకులు చేసిన నినాదాలతో జాతీయ రహదారి దద్దరిల్లింది.ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు.
ఈ క్రమంలో కిలోమీటర్ మేర వాహనాలు స్తంభించిపోగా… ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.మండల పార్టీ అధ్యక్షుడు మూనావత్ నరసింహ నాయక్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల గోడును పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే నేడు ఒక నిండు ప్రాణం బలైందని మండిపడ్డారు.శంకర్ గౌడ్ మృతితో ఒక కుటుంబం రోడ్డున పడిందని,ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఆ కుటుంబంలో ఒకరికి వెంటనే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అన్నారు.బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ… ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఇప్పుడే పరిష్కరించాలని సూచించారు.శంకర్ గౌడ్ మరణం అత్యంత బాధాకరమని,ఇది ఆత్మహత్య కాదని ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడి ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.శంకర్ గౌడ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాడుతామన్నారు.ప్రభుత్వం మొండి వైఖరిని వీడాలని,లేదంటే ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ఉదృతం చేయడానికి వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపి జినుగు అనిమిరెడ్డి,మాజీ జెడ్పిటిసి రంగు కుమార్,గారె నర్సయ్య,పూస మధు, లేతకుల రంగారెడ్డి,చిలువేరు సాయి గౌడ్,ఐత రామచందర్,చందు రాము,పాము మనోహర్,ఐత జంపి తదితరులు పాల్గొన్నారు.

