మహేశ్వరం వద్ద కేంద్ర మంత్రిని అడ్డుకున్న పోలీసులు
నర్సంపేటలో ఉద్రిక్తత
కాకతీయ,నర్సంపేట టౌన్: నర్సంపేట మండలంలోని మహేశ్వరం వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ముత్తోజీపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళి అర్పించేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు కాన్వాయ్‌ను పూర్తిగా ముందుకు అనుమతించకుండా, ఒకే వాహనం మాత్రమే వెళ్లాలని సూచించడంతో కేంద్ర మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. నివాళి అర్పించడానికి వెళ్తుంటే ఇబ్బందులు ఎందుకని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోలీసులు, కేంద్ర మంత్రితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం.
పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, ఆంక్షలను సడలించాలని కోరారు. కొద్దిసేపటి ఉద్రిక్తత అనంతరం పోలీసులు ఆయన కాన్వాయ్‌కు అనుమతి ఇచ్చారు.ఇదిలా ఉండగా, కేంద్ర మంత్రి రాకతో నర్సంపేటలో బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. నర్సంపేట నుంచి వందలాది మంది అనుచరులతో కలిసి ముత్తోజీపేట వైపు ఆయన బయలుదేరారు. కొద్దిసేపట్లో అక్కడికి చేరుకుని శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళి అర్పించనున్నట్లు సమాచారం.

