ప్రజల ముంగిటకే పోలీసింగ్
ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉంది
హెల్మెట్ ధరించండి.. ప్రాణాలు కాపాడుకోండి
అరైవ్ అలైవ్‌లో డీజీపీ శివధర్ రెడ్డి పిలుపు
రుద్రంగిలో ‘ఆధునిక’ పోలీస్ స్టేషన్‌కు శంకుస్థాపన!
రూ.2.50 కోట్లతో అత్యాధునిక హంగులతో నిర్మాణానికి శ్రీకారం
వేములవాడకు ట్రాఫిక్, మహిళా పోలీస్ స్టేషన్లు మంజూరు చేయాలి
డీజీపికి విజ్ఞప్తి చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
నేరాల నియంత్రణలో కెమెరాలదే కీలక పాత్ర : ఎస్పీ మహేష్ గితే
కాకతీయ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. ప్రజలకు మరింత చేరువగా, పారదర్శకమైన సేవలు అందించే లక్ష్యంతో రూ.2.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన పోలీస్ స్టేషన్ భవనానికి శుక్రవారం రాష్ట్ర డీజీపీ బీ శివధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితేలతో కలిసి ఆయన భూమి పూజ నిర్వహించారు. సుమారు ఎకరం స్థలంలో కార్పొరేట్ తరహా హంగులతో ఈ భవనం రూపుదిద్దుకోనుంది. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మావోయిజం అంతమైందని, ఇకపై పౌర కేంద్రిత పోలీసింగ్‌పైనే దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. “హత్యలు, ఇతర నేరాల కంటే రోడ్డు ప్రమాదాల్లోనే వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ద్విచక్ర వాహనదారులు తమ కుటుంబాల కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి” అని ఆయన కోరారు. ‘అరైవ్.. అలైవ్’ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై ప్రతి పౌరుడిని చైతన్యపరుస్తామన్నారు. వేములవాడ పుణ్యక్షేత్రం దృష్ట్యా అక్కడ ట్రాఫిక్, మహిళా పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డిది శాంతిభద్రతల పరిరక్షణ ధ్యేయం: విప్ ఆది శ్రీనివాస్
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. హోం శాఖను నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి శాంతిభద్రతల పరిరక్షణకు, డ్రగ్స్ నిర్మూలనకు పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. “తాను కోరిన వెంటనే రుద్రంగికి పోలీస్ స్టేషన్ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.150 కోట్లు కేటాయించి పనులు శరవేగంగా చేయిస్తున్నాం” అని పేర్కొన్నారు. భీమారంలోనూ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని డీజీపీని ఆయన కోరారు.
భద్రతలో సాంకేతికతకు ప్రాధాన్యం
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. జిల్లాలో ‘నో హెల్మెట్.. నో ఎంట్రీ’ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నామని, ఎన్నికలు మరియు జాతరలను ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీస్ యంత్రాంగం కృషి గొప్పదని కొనియాడారు. ఎస్పీ మహేష్ గితే మాట్లాడుతూ.. రుద్రంగిలో నేరాల నియంత్రణ కోసం ఇప్పటికే అత్యాధునిక ఏఎన్‌పీఆర్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, నూతన భవనం అందుబాటులోకి వస్తే ప్రజలకు సేవలు మరింత వేగవంతమవుతాయని తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర కో-ఆపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి, ఏఎస్పీ చంద్రయ్య, ఆర్డీఓ రాధాభాయ్, పలువురు సీఐలు, ఎస్ఐలు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

