రెండేళ్లలో మళ్లీ అధికారంలోకి వస్తాం
ఘనంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు
రాంపూర్‌లో జెండా ఆవిష్కరించిన గ్రామ శాఖ అధ్యక్షుడు కిష్టయ్య
కాకతీయ, చేర్యాల: తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్‌ఎస్ భారీ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాంపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు షేవల్ల కిష్టయ్య ధీమా వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని రాంపూర్ గ్రామంలో బీఆర్‌ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి, కార్యకర్తలకు మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిష్టయ్య మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ సాధనే లక్ష్యంగా కేసీఆర్ పార్టీని స్థాపించారని గుర్తుచేశారు. ఆనాడు అధికార గర్వంతో ఉన్న కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచి, అనేక పోరాటాల ద్వారా రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. రాష్ట్రం సిద్ధించాక పదేళ్ల పాటు కేసీఆర్ నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యమైందని, ఎన్నో ఏళ్ల సమస్యలను పరిష్కరించి పార్టీ ప్రజల గుండెల్లో నిలిచిపోయిందని పేర్కొన్నారు.
అమరవీరుల ఆకాంక్షలే ధ్యేయం..
కుట్రలు, ప్రలోభాలతో ఉద్యమాన్ని ఆపాలని చూసినా భయపడకుండా పోరాడామని, ఇప్పుడు కూడా అదే ధైర్యంతో ముందుకు సాగుతామని కిష్టయ్య స్పష్టం చేశారు. అమరవీరుల త్యాగాలు మరువలేనివని, వారి ఆకాంక్షల సాధనే ధ్యేయంగా పార్టీ పని చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని, త్వరలోనే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు. కార్యక్రమంలో వార్డు సభ్యుడు బండ ప్రసాద్, బండారి కిష్టయ్య, షేవల్ల లక్ష్మణ్, బండారి అంజయ్య, మలిపెద్ది భూషణ్, బండ రాజు, బండారి శ్రీశైలం, షేవల్ల రాములు, రంగు మల్లేశం గౌడ్, బండారి చంద్రం, రంగు అంజయ్య, బుడుత కుమార్ తదితరులు పాల్గొన్నారు.

