ధాన్యం కొనుగోళ్లలో జాప్యం
ఆందోళనకు దిగిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
చొప్పదండిలో ఉద్రిక్తత.. గట్టు బూత్కూరు వద్ద ధర్నా
రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
ఆందోళనకారులను అరెస్టు చేసిన పోలీసులు
కాకతీయ, కరీంనగర్: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నెలకొన్న సమస్యలపై నిరసన తెలిపిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. గంగాధర మండలం గట్టు బూత్కూరులో రైతులతో కలిసి ఆయన రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టడంతో నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో కోత పూర్తయిన వడ్లు కుప్పలుగా పేరుకుపోయినా, అధికారులు తూకం వేయడం లేదని రైతులు వాపోయారు. రైస్ మిల్లర్లకు అలాట్మెంట్ లేకపోవడంతోనే కొనుగోళ్లు నిలిచిపోయాయని, ఆకాశం మేఘావృతమై వర్షం పడితే తాము కోలుకోలేని విధంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై ప్రకటనలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో పోలీసులు రవిశంకర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పోలీసుల చర్యపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

