సాగుపై రైతులకు శాస్త్రవేత్తల దిశానిర్దేశం
మొలంగూరులో ‘రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు’
ఆధునిక పద్ధతులు, భూసార పరీక్షలపై అవగాహన
కాకతీయ, శంకరపట్నం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘99 రోజుల కార్యాచరణ ప్రణాళిక’లో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు’ కార్యక్రమం మంగళవారం మొలంగూరు గ్రామంలో రెండో రోజు కొనసాగింది. జిల్లావ్యాప్తంగా 64 గ్రామాల్లో మే 23 వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో భాగంగా శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా జగిత్యాల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు డా. తిరుపతి, డా. రాణి మాట్లాడుతూ.. రైతులు విచక్షణారహితంగా యూరియా వాడడాన్ని తగ్గించాలని, భూసార పరీక్షలు చేయించుకుని పోషకాల యాజమాన్యం చేపట్టాలని సూచించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న వరి రకాలను సాగు చేయడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని, పంట వైవిధ్యీకరణ మరియు సేంద్రియ సాగు దిశగా రైతులు అడుగులు వేయాలని కోరారు. మండల వ్యవసాయ అధికారి (ఏఓ) జి. వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం సిఫారసు చేసిన పంటలను సాగు చేసిన రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ సకాలంలో లభిస్తుందని తెలిపారు. ఉద్యాన అధికారిణి రవళి మాట్లాడుతూ అంతర పంటల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ కీర్తన, గ్రామ సర్పంచ్ రాజు, ఉప సర్పంచ్ రాజేష్, ఇతర ప్రజాప్రతినిధులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

