ప్రజలకు నమ్మకం కలిగించేలా పనిచేయాలి
పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి
సాంకేతిక ఆధారాలతో విచారణ వేగవంతం చేయాలి
కరీంనగర్ సీపీ గౌష్ ఆలం
హుజూరాబాద్‌లో చీటింగ్, ఫోర్జరీ కేసులపై సమీక్ష
కాకతీయ, హుజురాబాద్: హుజూరాబాద్ డివిజన్ పరిధిలో నమోదైన చీటింగ్, ఫోర్జరీ కేసుల పురోగతిపై పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం బుధవారం సమీక్ష నిర్వహించారు. హుజూరాబాద్ ఏసీపీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులపై ఆయన విపులంగా చర్చించారు. అమాయక ప్రజలను మోసం చేసే నేరస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీపీ ఆదేశించారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు తగిన న్యాయం అందేలా చూడాలని సూచించారు. నేరస్తులు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు ఫోరెన్సిక్ ఆధారాలను వినియోగించి విచారణ వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
పటిష్టమైన సాక్ష్యాలతో ఛార్జ్‌షీట్లు..
కోర్టులో నిందితులకు శిక్ష పడేలా పటిష్టమైన సాక్ష్యాలతో నిర్ణీత గడువులోగా ఛార్జ్‌షీట్లు దాఖలు చేయాలని సీపీ దిశానిర్దేశం చేశారు. పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారిలో నమ్మకాన్ని పెంపొందించే విధంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ సమీక్షలో ఏసీపీ మాధవి, ఇన్‌స్పెక్టర్లు కరుణాకర్, శ్రీనివాస్, రామకృష్ణ, ఎస్సైలు తిరుపతి, స్వాతి, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

