డీఎస్పీగా వెంకటేశ్వర్లుకు పదోన్నతి
అభినందించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
కాకతీయ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖలో చందుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు డీఎస్పీగా పదోన్నతి పొందారు. రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన తాజా ఉత్తర్వుల మేరకు ఆయనకు ఈ పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన ఎస్పీ మహేష్ బి. గితేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీ మహేష్ బి. గితే డీఎస్పీ వెంకటేశ్వర్లును శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలంగా ప్రజల భద్రత కోసం ఆయన అందించిన సేవలకు ఈ పదోన్నతి తగిన గుర్తింపని కొనియాడారు. ప్రతి ఉద్యోగి కెరీర్‌లో ప్రమోషన్ అనేది కీలక మైలురాయి అని, డీఎస్పీగా మరింత బాధ్యతతో విధులు నిర్వర్తించి శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని వెంకటేశ్వర్లుకు అభినందనలు తెలిపారు.

