పోలీసుల కస్టడీలో ఫోన్
ఖాతా నుంచి లక్షలు మాయం!
రిమాండ్ ఖైదీ బ్యాంక్ ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు
రూ. 6 లక్షలు గల్లంతు.. ఇంట్లో సొత్తు కూడా మాయం
కాకతీయ, కరీంనగర్ : పోలీసుల ఆధీనంలో ఉన్న సెల్‌ఫోన్ నుంచే లక్షల రూపాయల నగదు మాయమైన వింత ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడు రిమాండ్‌లో ఉన్న సమయంలోనే అతని బ్యాంక్ ఖాతా నుంచి నగదు బదిలీ కావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కరీంనగర్ పట్టణానికి చెందిన మహేందర్ అనే వ్యక్తిపై ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ క్రమంలో 2025 డిసెంబర్ 4న పోలీసులు మహేందర్‌ను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించే ముందు అతని సెల్‌ఫోన్‌ను సీజ్ చేశారు. ఇటీవల (మార్చి 26న) బెయిల్‌పై విడుదలైన మహేందర్ తన బ్యాంక్ ఖాతాను తనిఖీ చేసుకోగా.. ఫిబ్రవరి 19 మరియు మార్చి 17 తేదీల్లో రెండు విడతలుగా సుమారు రూ. 6 లక్షలకు పైగా నగదు బదిలీ అయినట్లు గుర్తించాడు. పోలీసులు సీజ్ చేసిన తన ఫోన్ ద్వారానే ఈ లావాదేవీలు జరగడంపై బాధితుడు విస్మయం వ్యక్తం చేస్తున్నాడు. కేవలం నగదు మాత్రమే కాకుండా, తన ఇంట్లో ఉన్న 157 గ్రాముల బంగారం, వెండి వస్తువులు, హార్డ్ డిస్కులు, చెక్‌బుక్కులు కూడా గల్లంతైనట్లు అతను వాపోతున్నాడు.
దర్యాప్తు ముమ్మరం..
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. నగదు బదిలీ అయిన కొన్ని అనుమానాస్పద బ్యాంక్ ఖాతాలను ఇప్పటికే గుర్తించి సీజ్ చేశారు. అందులోని రూ. 50 వేల నగదును విత్‌డ్రా కాకుండా నిలిపివేశారు. పోలీసుల ఆధీనంలో ఉన్న ఫోన్ ద్వారా నగదు ఎలా మాయమైందనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం అసలు నిందితులు ఎవరనేది తేలనుంది.

