అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలి
మొక్కజొన్న పంట దగ్ధం.. రైతుల ఆవేదన
ఎకరాకు రూ. 50 వేల పరిహారం ఇవ్వాలి
సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు
కాకతీయ, చింతకాని: మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదాల్లో మొక్కజొన్న పంట కాలిపోయి నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన పార్టీ నాయకులతో కలిసి నరసింహపురం, చింతకాని గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నరసింహపురం, చింతకాని, తిమ్మినేనిపాలెం, నాగిలిగొండ, బస్వాపురం గ్రామాల్లో సుమారు 50 ఎకరాల్లో మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైందని ఆవేదన వ్యక్తం చేశారు.
కల్లాల్లోనే పంట.. తరలింపులో జాప్యం
పంట చేతికొచ్చి నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో తూకాలు వేయకపోవడం, వేసిన పంటను గోడౌన్లకు తరలించకపోవడం వల్లే ఈ అనర్థాలు జరుగుతున్నాయని గోపాలరావు విమర్శించారు. లారీల కొరత నెపంతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఫలితంగా అగ్ని ప్రమాదాలు, అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. అధికారులు కేవలం ప్రారంభోత్సవాలకే పరిమితం కాకుండా, కల్లాల్లో ఉన్న పంటను వెంటనే లారీల ద్వారా గోడౌన్లకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ట్రాక్టర్ దగ్ధం.. బాధితులకు భరోసా ఏది?
పొలం దున్నేందుకు వచ్చిన ఓ రైతు ట్రాక్టర్ కూడా ఈ ప్రమాదంలో పూర్తిగా కాలి బూడిదైందని, ఆ రైతును ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అగ్ని ప్రమాద బాధితులకు ఎకరాకు రూ. 50 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని, రెవెన్యూ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపాలని డిమాండ్ చేశారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే పాలకులు రైతులను గాలికి వదిలేయడం సరికాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు నన్నక కృష్ణమూర్తి, రైతు సంఘం నేత మడిపల్లి కిరణ్ బాబు, దేశభయిన ఉపేందర్, గడ్డం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

