సంక్షేమంలో పెద్దపల్లి ఆదర్శం
ప్రభుత్వ విప్ విజయ రమణారావు
రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రికి నాలుగు అవార్డులు
మే 6న మెగా జాబ్ మేళా.. 2 వేల మందికి ఉపాధి
48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు
కాకతీయ, పెద్దపల్లి : సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో పెద్దపల్లి జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తోందని ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు పేర్కొన్నారు. పెద్దపల్లి మండలం బండంపల్లిలో శనివారం నిర్వహించిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, డీసీపీ రామ్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు జిల్లాలో సమగ్రంగా అమలవుతున్నాయని, సామాన్యులకు పాలన చేరువవుతోందని వివరించారు. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలిచి నాలుగు అవార్డులు సాధించడం గర్వకారణమని విప్ హర్షం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో గతంలో 280గా ఉన్న ఓపీ సంఖ్య 900కు, ప్రసవాల సంఖ్య 40 నుంచి 250కు పెరిగిందని తెలిపారు. కొత్త ఆసుపత్రి భవనం నిర్మాణం వేగంగా సాగుతోందని, త్వరలోనే ఎంఆర్ఐ, సీటీ స్కాన్ వంటి ఆధునిక వసతులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కార్డియాలజీ, డయాలసిస్ సేవలు మెరుగుపడటంతో ఇతర ప్రాంతాల నుంచి కూడా రోగులు ఇక్కడికి వస్తున్నారని గుర్తుచేశారు.
యువతకు ఉపాధి.. రైతులకు భరోసా..
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ.. మే 6న వెంకట పద్మ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సుమారు 100 కంపెనీలు పాల్గొని 2 వేల మంది యువతకు ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలులో ఎలాంటి కోతలు లేకుండా 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. డీజిల్, పెట్రోల్ కొరతపై వస్తున్న వార్తలు అసత్యమని, జిల్లాలో తగినంత నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు.
అమల్లో అభయహస్తం..
గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ కూడా వేగవంతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

