‘వేస్ట్ టు ఎనర్జీ’ వద్దు.. ప్రాజెక్టును రద్దు చేయాలి
సిర్సపల్లి శివారులో కొనసాగుతున్న ఆందోళనలు
అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నెల రోజులుగా దీక్షలు
కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణానికి సమీపంలోని సిర్సపల్లి గ్రామ శివారులో ప్రతిపాదించిన ‘వేస్ట్ టు ఎనర్జీ’ (చెత్త నుంచి విద్యుత్) ప్రాజెక్టును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు ఉధృతమయ్యాయి. వేస్ట్ టు ఎనర్జీ వ్యతిరేక ఐక్య పోరాట అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నెల రోజులుగా చేపడుతున్న దీక్షల్లో భాగంగా.. శనివారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక నిరసన కార్యక్రమం నిర్వహించారు. చందుపట్ల జనార్ధన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చెత్త నుంచి వెలువడే రసాయనాలు భూమిలోకి చేరి భూగర్భ జలాలు కలుషితమవుతాయని, దీనివల్ల వ్యవసాయం దెబ్బతింటుందని పేర్కొన్నారు. అంతేకాకుండా, చెత్తను కాల్చే ప్రక్రియలో విడుదలయ్యే డయాక్సిన్ వంటి విషవాయువుల వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ప్రజాప్రతినిధులు స్పందించాలి
ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలని అఖిలపక్ష కమిటీ కోరింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ ప్రాజెక్టును రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, జేఏసీ ప్రతినిధులు, చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

