రైతన్నల సంతోషమే ప్రభుత్వ ధ్యేయం
గతంలో భూకబ్జాలు.. ఇప్పుడు ప్రజాపాలన
నిజమైన లబ్ధిదారులకే సంక్షేమ ఫలాలు
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
వరంగల్ తూర్పులో రూ. 4 కోట్ల విలువైన చెక్కుల పంపిణీ
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని సాయి కన్వెన్షన్లో శనివారం నిర్వహించిన ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వరంగల్, ఖిలా వరంగల్ మండలాలకు చెందిన 132 మంది లబ్ధిదారులకు సుమారు రూ. 4 కోట్ల విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.
అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత పాలకుల తీరుపై నిప్పులు చెరిగారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు మినహా, ఆ తర్వాత కొత్తగా ఏమీ జరగలేదని విమర్శించారు. గత ప్రభుత్వ నాయకులు ప్రజల సొమ్ము దోచుకోవడమే కాకుండా భూకబ్జాలపైనే శ్రద్ధ పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే అభివృద్ధి మళ్లీ వేగవంతమైందని ధీమా వ్యక్తం చేశారు. కులమతాలకు అతీతంగా, వికలాంగులకు అవసరమైన ల్యాప్టాప్లు, వీల్ ఛైర్లు వంటి ఉపకరణాలను ప్రభుత్వం అందజేస్తోందన్నారు.
రైతులకు, మహిళలకు అండగా..
రైతన్నలకు పెట్టుబడి సాయం అందిస్తూనే, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని సురేఖ తెలిపారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలు అధ్వానంగా ఉండేవని, ఇప్పుడు పాఠశాలలు తెరిచిన వెంటనే విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పైరవీలకు తావులేకుండా నిజమైన లబ్ధిదారులకు పథకాలు చేరవేస్తామని, వరంగల్ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజ్, కార్పొరేటర్లు సోమిశెట్టి ప్రవీణ్, పల్లం పద్మ, ముష్కమల అరుణ, భోగి సువర్ణ, భైరవ ఉమ, పోషాల పద్మ, మర్పల్లి రవి, వాస్కుల బాబు తదితరులు పాల్గొన్నారు.

