కరీంనగర్‌లో సంచలనం..
జ్యువెలరీ షాపుపై కాల్పులు జరిపి బంగారం అపహరణ
తుపాకులతో చొరబడిన ఐదుగురు దుండగులు
సిబ్బందిని బెదిరించి కాల్పులు.. భారీగా బంగారం అపహరణ
తీవ్ర గాయాలైన ఉద్యోగులు.. గాలిస్తున్న ప్రత్యేక బృందాలు
కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ నగర నడిబొడ్డున దుండగులు బరితెగించారు. పట్టపగలే తుపాకులతో హల్‌చల్ చేసి భయానక వాతావరణం సృష్టించారు. నగరంలోని ప్రముఖ పీఎంజే జువెలరీ షాపులోకి చొరబడిన దుండగులు కాల్పులకు తెగబడి, భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటన నగరంలో తీవ్ర సంచలనం సృష్టించింది. స్థానికులు మరియు పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం 11 గంటలకు ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి ఒకేసారి షాపులోకి ప్రవేశించారు. లోపలికి రాగానే తుపాకులతో సిబ్బందిని బెదిరించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన సిబ్బందిపై దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో షాపు సిబ్బంది గాయపడగా, వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. క్షణాల్లోనే షాపులోని విలువైన బంగారు ఆభరణాలను సంచుల్లో నింపుకుని దుండగులు పరారయ్యారు.

రంగంలోకి క్లూస్ టీమ్..
సమాచారం అందుకున్న వెంటనే పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు నగర సరిహద్దులను దిగ్బంధించారు. క్లూస్ టీమ్ వేలిముద్రలను సేకరిస్తోంది. షాపులోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రణాళికాబద్ధంగానే ఈ దోపిడీకి పాల్పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఈ దోపిడీ నేపథ్యంలో నగరంలోని వ్యాపార వర్గాల్లో ఆందోళన నెలకొంది.

