కూసుమంచిని ‘విద్యా హబ్’గా తీర్చిదిద్దాలి
మండలంలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయాలి
మంత్రి పొంగులేటికి బీజేపీ నేతల వినతి
కాకతీయ, కూసుమంచి: పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండల కేంద్రాన్ని విద్యాపరంగా అభివృద్ధి చేసి, ఇక్కడ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా నాయకులు గుండా ఉపేందర్ రెడ్డి కోరారు. ఆదివారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మండలంలో ట్రిపుల్ ఐటీ లేకపోవడంతో బడుగు, బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థులు ఉన్నత చదువుల కోసం బాసర వంటి దూర ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూసుమంచిలో క్యాంపస్ ఏర్పాటు చేస్తే గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్య చేరువవుతుందని పేర్కొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి పట్టుబట్టాలి..
ట్రిపుల్ ఐటీతో పాటు మండలంలోని పలు పెండింగ్ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు
రూ. 5 లక్షల వ్యయంతో నిర్మించిన క్రీడా ప్రాంగణం ఎక్కడ ఉందో అధికారులే కనిపెట్టి క్రీడాకారులకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ లేకపోవడం వల్ల పాలన కుంటుపడుతోందని, వెంటనే అధికారిని నియమించాలని కోరారు. కూసుమంచిలో బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని, 200 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు అర్హులందరికీ పింఛన్లు అందజేయాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక కమిటీలను రద్దు చేసి, సర్పంచ్ పాలక వర్గాల ద్వారా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని విన్నవించారు. వినతి పత్రం అందజేసిన వారిలో బీజేపీ నాయకులు మంద చంద్రశేఖర్ గౌడ్, బద్దం వెంకటరెడ్డి, జువ్వాడి సురేష్ తదితరులు ఉన్నారు.

