ఏడ్చిన నేల.. దగ్ధమైన ఆశలు!
కొనయిపల్లిలో భారీ అగ్నిప్రమాదం
మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి.. లక్షల్లో నష్టం
ఆదుకోవాలని బాధితుల ఆవేదన
కాకతీయ, వేములవాడ: వేములవాడ పట్టణ పరిధిలోని కొనయిపల్లిలో సోమవారం సంభవించిన అగ్నిప్రమాదం అన్నదాతలకు కన్నీరు మిగిల్చింది. చేతికొచ్చిన మొక్కజొన్న పంట కళ్లముందే అగ్నికి ఆహుతి కావడంతో రైతులు గుండె కోతకు గురయ్యారు. ఆకస్మాత్తుగా చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలోనే ఎకరాల మేర వ్యాపించి బీభత్సం సృష్టించాయి. గ్రామ సమీపంలోని మొక్కజొన్న పొలాల్లో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు మొదలయ్యాయి. పంట పూర్తిగా ఎండిపోయి ఉండటంతో పాటు, గాలి వేగం తోడవడంతో మంటలు క్షణాల్లో చుట్టుపక్కల పొలాలకు విస్తరించాయి. గమనించిన రైతులు మంటలను ఆర్పేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక యంత్రం వెంటనే ఘటనాస్థలికి చేరుకొని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చింది.
లక్షల్లో నష్టం..
ఈ ప్రమాదంలో సుమారు ఎకరాల కొద్దీ పంట దగ్ధమైందని, దీనివల్ల రైతులకు లక్షల రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లిందని స్థానికులు తెలిపారు. కష్టపడి పండించిన పంట మార్కెట్‌కు వెళ్లే తరుణంలో ఇలా కాలిబూడిదవ్వడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి, పంట నష్టాన్ని అంచనా వేసి తమను ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.

