‘గులాబీ’ పునర్వ్యవస్థీకరణకు కసరత్తు
నూతన కమిటీల నియామకానికి కేసీఆర్ పచ్చజెండా
సభ్యత్వ నమోదుపై పార్టీ శ్రేణుల దృష్టి
యువత, మహిళలకు పెద్దపీట..
కాకతీయ, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కసరత్తు ముమ్మరమైంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జిల్లాల వారీగా నూతన కమిటీల ఏర్పాటు ప్రక్రియ వేగం పుంజుకుంది. పాత మండల, జిల్లా కమిటీలను రద్దు చేసి, నూతన ఉత్సాహంతో కూడిన కొత్త బృందాలను రంగంలోకి దించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది.
ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో సభ్యత్వ నమోదు..
పార్టీ బలోపేతంలో భాగంగా సభ్యత్వ నమోదు ప్రక్రియను విస్తృతంగా చేపట్టనున్నారు. అటు ఆన్లైన్, ఇటు ఆఫ్లైన్ విధానాల్లో సభ్యత్వాలు స్వీకరిస్తూ.. యువతకు, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని 4 జిల్లా కమిటీలు, దాదాపు 60 మండల కమిటీల నియామకంపై ఇప్పటికే కసరత్తు ప్రారంభమైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రతి మండలంలో చురుగ్గా పనిచేసే కార్యకర్తలను గుర్తించి, వారికి తగిన బాధ్యతలు అప్పగించే దిశగా చర్చలు సాగుతున్నాయి.
కార్యకర్తలకు శిక్షణ.. ఎన్నికలకు సన్నద్ధం
సభ్యత్వ నమోదు అనంతరం కార్యకర్తల వివరాలతో సమగ్ర డేటాబేస్ సిద్ధం చేయనున్నారు. ఆ తర్వాత కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహించి.. ఎన్నికల వ్యూహాలు, ప్రజా సమస్యలపై పోరాటం, సోషల్ మీడియా వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి, ప్రజలతో నేరుగా అనుసంధానం కావడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపడుతున్నారు. త్వరలోనే పూర్తిస్థాయి కమిటీల జాబితాను ప్రకటించనున్నట్లు, దీనితో జిల్లాలో పార్టీ కార్యకలాపాలు మరింత పుంజుకోనున్నాయని పార్టీ నేతలు పేర్కొన్నారు.

