లోడింగ్, అన్లోడింగ్లో జాప్యం చేయొద్దు
హమాలీల కొరత తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు
కాకతీయ, పెద్దపల్లి : జిల్లాలో ధాన్యం లోడింగ్, అన్లోడింగ్ పనులను ఎక్కడా జాప్యం లేకుండా అత్యంత వేగవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. జిల్లాలో పంట కొనుగోళ్లు, ధాన్యం నిల్వలు, రవాణా తదితర అంశాలపై ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగానే మంగళవారం ఎలిగేడు మండలంలోని నర్సాపూర్ ఐకేపీ, మంథని గంగపురి ఐకేపీ కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఆయా కేంద్రాలకు వచ్చిన పంట పరిమాణం, ఇప్పటివరకు సేకరించిన ధాన్యం వివరాల రికార్డులను ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.
నిర్ణీత శాతం తేమ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, వీలైనంత త్వరగా రైస్ మిల్లర్లకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అకాల వర్షాల ముప్పును దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాల్లో తార్పాలిన్లను సిద్ధంగా ఉంచాలని, గన్నీ బ్యాగుల కొరత లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రస్తుతం వేడిగాలులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు అవసరమైన కనీస సదుపాయాలు కల్పించాలన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లో లోడింగ్, అన్లోడింగ్ పనులను మరింత వేగవంతం చేయాలని పేర్కొన్నారు. లారీల రవాణా, హమాలీల కొరత వంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ యాకన్న, మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్, ఏడీఏ అంజని తదితరులు పాల్గొన్నారు.

