ఆయిల్ ఫామ్ సాగుతో ముప్పై ఏళ్లు ఆర్థిక భరోసా
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేస్తేనే మెరుగైన ఆదాయం
అంతర పంటలతో అదనపు లాభాలు పొందే వీలు
జిల్లా అదనపు కలెక్టర్ సంపత్ రావు
ములుగులో ఉద్యానవన, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సు
కాకతీయ, ములుగు ప్రతినిధి: రైతులు సాంప్రదాయ సేద్యానికే పరిమితం కాకుండా మార్కెట్‌లో నిరంతరం డిమాండ్ ఉండే ఆయిల్ ఫామ్ లాంటి ప్రత్యామ్నాయ, ఉద్యానవన పంటల సాగుపై ప్రత్యేక ఆసక్తి చూపాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు సూచించారు. పంటల డిమాండ్, సప్లై ఆధారంగానే మార్కెట్లో ధరలు నిర్ణయమవుతాయని పేర్కొన్నారు. మనదేశంలో వంట నూనెల కొరత కారణంగా నిత్యం ఇతర దేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకుంటున్నామని, అందువల్ల ఆయిల్ ఫామ్ పంటకు మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుందని వివరించారు. ఒకసారి ఆయిల్ ఫామ్ సాగు చేపడితే ఏకంగా 30 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పంట దిగుబడితో పాటు స్థిరమైన ఆదాయం సమకూరుతుందని స్పష్టం చేశారు. రైతులు ఆయిల్ ఫామ్ తోటలలో అంతర్గత పంటలను కూడా సాగు చేసుకుంటూ రెండు విధాలుగా లాభాలు ఆర్జించవచ్చని హితవు పలికారు. సదస్సుకు అధ్యక్షత వహించిన ఉద్యానవన శాఖ అధికారి డి. సంజీవరావు మాట్లాడుతూ.. ములుగు జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 1,069 మంది రైతులు 3,562.40 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వం ఒక ఎకరాకు వివిధ అంశాల కింద 50 వేల రూపాయల వరకు సబ్సిడీ అందిస్తోందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సబ్సిడీలతో ప్రభుత్వం ప్రోత్సాహం
రైతులు ఆయిల్ ఫామ్, ఉద్యానవన పంటల సాగుపై పూర్తిస్థాయి అవగాహన పెంపొందించుకోవాలని ములుగు మున్సిపాలిటీ చైర్‌పర్సన్ చింత నిప్పుల చంద్రకళ సూచించారు. పంట మార్పిడిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీలు అందిస్తోందని తెలిపారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన ఈ అవగాహన సదస్సులో ఉద్యానవన ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, కిసాన్ సెల్ అధ్యక్షుడు బొల్లెపల్లి రాజేందర్, జిల్లా మత్స్యశాఖ అధికారి సాల్మన్ రాజు, డిసిఓ రామ్మోహన్, కె ఎన్ బయోసైన్స్ కంపెనీ యం డి సుధా రెడ్డితో పాటు స్థానిక కౌన్సిలర్లు, వ్యవసాయ అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

