గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి
కేంద్రానికి ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి
కాకతీయ, కరీంనగర్ : గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మస్జిద్–ఈద్గా–కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ, ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సహా కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
రైతులు వ్యవసాయంలో పనికిరాని స్థితికి చేరిన ఆవులను మార్కెట్‌కు తీసుకువస్తున్నప్పటికీ, వాటి కొనుగోలులో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఆవులను కొనుగోలు చేయడానికి వచ్చిన వారిని కొందరు అడ్డుకోవడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయని పేర్కొన్నారు. దీంతో రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
ఇలాంటి ఘర్షణలు నివారించాలంటే గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి నిర్ణయం తీసుకుంటే ఆవుల కొనుగోలు వ్యవహారాల్లో వివాదాలు తగ్గి, సమాజంలో శాంతి నెలకొంటుందని అన్నారు.
ప్రత్యేకంగా బక్రీద్ పండుగ సమయంలో ఆవుల కొనుగోలు, రవాణా అంశాలపై తలెత్తే వివాదాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని కేబినెట్ స్థాయిలో నిర్ణయం తీసుకోవాలని కోరారు.
దేశంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు సమాజాల మధ్య సౌహార్ద వాతావరణం కొనసాగుతోందని, అలాంటి ఐక్యతను కాపాడటం అందరి బాధ్యత అని ముజాహిద్ హుస్సేన్ తెలిపారు.

