జీడబ్ల్యూఎంసీ పాలనలో అంతా అవినీతే
అన్ని శాఖల్లో అవినీతి, అక్రమాల పర్వం
మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ విమర్శలు
కమీషన్ల దందా పరాకాష్టకు చేరిందని ఆరోపణ
జీడబ్ల్యూఎంసీ పాలనపై కార్పొరేషన్ ఎదుట ఆందోళన
కాకతీయ, వరంగల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) పాలనలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కాంగ్రెస్, బీజేపీ ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని నేతలు విమర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ… బల్దియాలో చోటుచేసుకున్న ప్రతి తప్పును ప్రశ్నిస్తామని, తప్పు చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కార్పొరేషన్లో కమీషన్ల దందా పరాకాష్టకు చేరిందని నన్నపునేని ఆరోపించారు. “కొంతమందికి 6 శాతం, మరికొందరికి 9 శాతం కమీషన్లు వసూలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. చివరకు బదిలీలకు కూడా డబ్బులు అడుగుతున్నారు” అంటూ మండిపడ్డారు.
మాస్టర్ ప్లాన్ పేరుతో నగరంలో విధ్వంసం సృష్టించారని, తమకు నచ్చని వారి భూములను గ్రీన్ జోన్లలో చేర్చడం, నచ్చిన వారి కోసం రోడ్ల అలైన్మెంట్లు మార్చడం వంటి అక్రమాలు జరిగాయని ఆరోపించారు. వీటికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు.
అభివృద్ధిపై చర్చకు సవాల్
“గత పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏంటో, గత 30 నెలల్లో కాంగ్రెస్–బీజేపీలు చేసిన విధ్వంసం ఏంటో చర్చించేందుకు నేను సిద్ధం” అని నన్నపునేని సవాల్ విసిరారు. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన పత్రాలు, ఆధారాలతో ప్రజల ముందుకు వస్తామని చెప్పారు. రోడ్ల కబ్జాలు, ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ల అంశాలపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అధికారులను భయభ్రాంతులకు గురిచేసే విధంగా కొందరు నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తుమికి రమేష్ బాబు, మాజీ కార్పొరేటర్లు కుందారపు రాజేందర్, దండు దయాసాగర్, కొంతం మోహన్, సోమ రామబాబురావు, మాజీ ఆర్టీఏ సభ్యులు గోరంట్ల మనోహర్, బీఆర్ఎస్ నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

