కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి
డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కాకతీయ, కరీంనగర్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డా. మేడిపల్లి సత్యం విమర్శించారు. ప్రజల్లో ఉద్రిక్తతలు రేకెత్తించే వ్యాఖ్యలు మానుకోవాలని హెచ్చరించారు. గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ద్వారా విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందన్నారు. వ్యక్తిగత ఆరోపణలు, అభ్యంతరకర వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తాయని పేర్కొన్నారు.
తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరూ ప్రవర్తించరాదని సూచించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులపై అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాజకీయాల్లో సంయమనం అవసరమని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో మాట్లాడాలని సూచించారు. బీఆర్ఎస్ నాయకులు రాజకీయ పరిమితులు దాటకుండా వ్యవహరించాలని మేడిపల్లి సత్యం అన్నారు. అనుచిత వ్యాఖ్యలు కొనసాగిస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సింది పోయి వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదన్నారు.

