సమ్మె బాటలో వీఓఏలు
సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని డిమాండ్
ఏపీఎం కార్యాలయంలో సమ్మె నోటీసు అందజేత
స్పందించకపోతే నిరవధిక సమ్మె : వీఓఏ జేఏసీ నాయకులు
కాకతీయ, ఏన్కూర్: గ్రామీణ పేదల అభివృద్ధికి సేవలందిస్తున్న వీఓఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఐకేపి వీఓఏ జేఏసీ డిమాండ్ చేసింది. డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు గురువారం ఏన్కూరు మండల కేంద్రంలోని ఏపీఎం కార్యాలయంలో అధికారులకు వీఓఏలు సమ్మె నోటీసుతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వీఓఏ నాయకులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఉద్యోగ భద్రత, సరైన వేతనం, సంక్షేమ సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు ₹20 వేల కనీస వేతనం, ప్రత్యేక హెచ్ఆర్ పాలసీ అమలు, సీసీ సదుపాయాల కల్పన, పెండింగ్ టీఏ బిల్లుల చెల్లింపు, 58 సంవత్సరాల వరకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న వీఓఏల పట్ల ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మే 18, 2026లోపు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడతామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. సమ్మెకు ముందు దశలవారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లా పీడీలకు వినతిపత్రాలు అందజేశామని, మండల కేంద్రాల్లో ఏపీఎం, ఎంఎస్, వీఓఓబీ అధికారులకు సమ్మె నోటీసులు ఇస్తున్నామని పేర్కొన్నారు. మే 9న స్థానిక ఎమ్మెల్యేలను కలిసి సమస్యలు వివరించనున్నట్లు, మే 13న రాష్ట్రవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో నిరసనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రతి వీఓఏ ఉద్యమంలో చురుకుగా పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.

