టెన్త్ ఫలితాల్లో జిల్లా ప్రతిభ గర్వకారణం
ములుగు అభివృద్ధికి కలిసి కట్టుగా పనిచేయాలి
ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరలోనే ప్రత్యేక అధికారి నియామకం
అటవీ ప్రాంత గిరిజనులను ఇబ్బంది పెట్టవద్దు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
కాకతీయ, ములుగు ప్రతినిధి : అధికారుల సమన్వయంతో ములుగు జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, డి.ఎఫ్.ఓ వికాస్ మీనాలతో కలిసి జిల్లా అభివృద్ధి పనుల పురోగతిపై ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను మంత్రి శాలువాలతో సన్మానించారు. అక్షరమాలలో ములుగు జిల్లాను వెలిగించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.

ప్రజా దర్బార్ ఫిర్యాదులపై ప్రత్యేక నిఘా
జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందని, ఇందులో భాగంగా ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా పరిష్కరిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ ఫిర్యాదుల స్థితిగతులపై పూర్తిస్థాయి పర్యవేక్షణ కోసం త్వరలోనే ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నూతన గ్రామపంచాయతీ భవనాలకు అంచనాలు సిద్ధం చేసి పనులు యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని సూచించారు. వేసవి దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక వసతులకు నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేలోపు భవనాల మరమ్మతు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
అటవీ గ్రామాల్లో సౌకర్యాల కల్పన
అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో కనీస సౌకర్యాల కల్పన విషయంలో అటవీ అధికారులు గిరిజనులను ఇబ్బందులకు గురిచేయవద్దని, దీనిపై త్వరలోనే ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అంతరించిపోయే వృక్షజాతులు, పండ్ల మొక్కలతో ప్రత్యేకంగా పార్కులు ఏర్పాటు చేయాలని, ఇప్ప చెట్ల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మేడారం జాతరలో అద్భుతంగా పనిచేసిన మహిళా సంఘాలు అదే స్ఫూర్తితో గోదావరి పుష్కరాల్లోనూ స్టాల్స్ ఏర్పాటు చేయాలని, వారికి డి.ఆర్.డి.ఏ ద్వారా ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేయాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్, ఆర్డీవో వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

