మాలల అభివృద్ధిని విస్మరిస్తారా?
తక్షణమే మాల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
మాల మహానాడు మండల అధ్యక్షుడు వేర్పుల నరేష్
కాకతీయ, మణుగూరు : “ఎన్నికల సమయంలో దళితులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సాక్షిగా చేవెళ్ల డిక్లరేషన్‌లో ప్రకటించిన అంశాలను అమలు చేయకుండా మాలలకు అన్యాయం చేస్తారా?” అంటూ మాల మహానాడు నాయకులు ప్రభుత్వాన్ని నిలదీశారు. శుక్రవారం మణుగూరులోని మాల మహానాడు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేర్పుల నరేష్, బూర్గుల సతీష్ మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మాలలు ఎంతో కృషి చేశారని, అయితే ప్రభుత్వం మాత్రం మాలలను అణిచివేసేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ఆర్థికంగా దెబ్బతీసే కుట్ర..
వర్గీకరణ ద్వారా ఇప్పటికే విద్యా, ఉద్యోగ అవకాశాల్లో మాలలకు తీవ్ర అన్యాయం జరిగిందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మాల కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ఆర్థికంగానైనా ఆదుకోవాలని కోరారు. ఇతర కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. మాలల విషయంలో ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు. తక్షణమే మాల కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, దాని కోసం రూ. 2 వేల కోట్లు కేటాయించాలని, జాతి పట్ల నిబద్ధత ఉన్న వారికి అందులో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షుడు మద్దెల భద్రయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ వేర్పుల సురేష్, ఉపాధ్యక్షులు బూర్గుల సంజీవరావు, తోట ప్రసాద్, వేల్పుల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

