భీమేశ్వరాలయంలో భక్తుల సందడి
దర్శించుకున్న 45 వేల మందికి పైగా భక్తులు
కాకతీయ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో పోటెత్తింది. సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. రోజంతా కలిపి సుమారు 45 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. స్వామివారిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకోవడంలో నిమగ్నమయ్యారు. తలనీలాలు సమర్పించి, కోడె మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన అభిషేకం, నిత్య కళ్యాణం, చండీ హోమం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, కుంకుమార్చన, లింగార్చన, ఆకుల పూజ వంటి ప్రత్యేక కార్యక్రమాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల రాకతో కోలాహలంగా మారింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం ఈవో రమాదేవి ఆధ్వర్యంలో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి సౌకర్యం కల్పించారు. దర్శన ఏర్పాట్లు, ప్రసాదాల పంపిణీని అధికారులు నిరంతరం పర్యవేక్షించారు. వేసవి తీవ్రత దృష్ట్యా భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.

