సర్కారు బడుల్లో ‘డిజిటల్’ విప్లవం!
ఆగస్టు నాటికి హైస్కూళ్లకు హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పాఠశాలలకు డిజిటల్ యోగం
టీ-ఫైబర్, బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా వేగవంతమైన కనెక్షన్లు
కార్పొరేట్ స్థాయిలో స్మార్ట్ క్లాసులు, వర్చువల్ బోధన
‘అటల్ టింకరింగ్ ల్యాబ్’లపై విద్యాశాఖ ప్రత్యేక నజర్
కాకతీయ, కరీంనగర్ : ప్రభుత్వ పాఠశాలలు ఆధునిక హంగులతో ముస్తాబవుతున్నాయి. కార్పొరేట్ బడులకు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ విద్యా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ హైస్కూళ్లను అత్యాధునిక డిజిటల్ విద్యా కేంద్రాలుగా మార్చేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. 2026 ఆగస్టు నాటికి అన్ని ఉన్నత పాఠశాలలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించేలా అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ఈ విప్లవాత్మక మార్పుతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం అంతర్జాతీయ స్థాయి విద్యాబోధన చేరువ కానుంది. కేవలం భవనాల రంగులు మార్చడమే కాకుండా, బోధనా పద్ధతుల్లో సమూల మార్పులు తీసుకువస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
జిల్లాల వారీగా నెట్ కనెక్టివిటీ.. ఆధునిక సౌకర్యాలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న వేల సంఖ్యలోని పాఠశాలలకు టీ-ఫైబర్ లేదా బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్లు అందించనున్నారు. జిల్లా కేంద్రాల నుంచి మారుమూల గ్రామాల వరకు ఉన్న హైస్కూళ్లను ఒకే నెట్‌వర్క్ కిందికి తీసుకురావడమే ప్రభుత్వం ప్రధాన లక్ష్యం. కరీంనగర్ జిల్లాలో 654 ఉన్నత పాఠశాలలకు ఈ సదుపాయం కల్పిస్తుండగా, జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 789 స్కూళ్లలో డిజిటలైజేషన్ పనులు జరగనున్నాయి. అలాగే పెద్దపల్లి జిల్లాలో 564 పాఠశాలల ఆధునీకరణకు, రాజన్న సిరిసిల్లలో 491 పాఠశాలలకు ఇంటర్నెట్ వెసులుబాటు కల్పించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం ద్వారా విద్యార్థులకు డిజిటల్ లెర్నింగ్ మాత్రమే కాకుండా, నిష్ణాతులైన ఉపాధ్యాయులతో వర్చువల్ క్లాసుల నిర్వహణ సులభతరం కానుంది. ప్రతి విద్యార్థికి ఆన్‌లైన్ పరీక్షలు, స్మార్ట్ టీచింగ్ విధానాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా విద్యా ప్రమాణాలను మెరుగుపరచవచ్చని అధికారులు భావిస్తున్నారు. క్లిష్టమైన సబ్జెక్టులను సైతం యానిమేషన్లు, వీడియోల రూపంలో వివరించడం ద్వారా విద్యార్థుల్లో నేర్చుకోవాలనే జిజ్ఞాస పెరుగుతుందని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రయోగాత్మక విద్య.. సృజనాత్మకతకు పెద్దపీట
కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. ఇందులో భాగంగా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్ల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాలని సైన్స్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రయోగాత్మక బోధన ద్వారా విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తిని పెంపొందించడమే దీని ముఖ్య ఉద్దేశం. ప్రతి విద్యార్థి స్వయంగా సైన్స్ మోడల్స్ రూపొందించేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాల్సి ఉంటుంది. స్మార్ట్ బోర్డులు, ప్రొజెక్టర్లు మరియు ఈ-కంటెంట్ ద్వారా మారుమూల పల్లెల్లోని విద్యార్థులకు కూడా ప్రపంచ స్థాయి విజ్ఞానాన్ని అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ డిజిటల్ విద్యా సంస్కరణలతో సర్కారు బడుల పట్ల తల్లిదండ్రుల్లో నమ్మకం గణనీయంగా పెరుగుతోంది. గతంలో పట్టణ ప్రాంతాలకే పరిమితమైన హైస్పీడ్ ఇంటర్నెట్, స్మార్ట్ క్లాసులు నేడు మారుమూల పల్లెల్లోని ప్రభుత్వ బడులకు సైతం పాకడం శుభపరిణామమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆధునిక సాంకేతికతను విద్యతో జోడించడం ద్వారా విద్యార్థులను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రైవేటు బడులకు ఏమాత్రం తీసిపోని విధంగా సర్కారు బడులు ‘డిజిటల్’ కాంతిని వెదజల్లుతూ కొత్త చరిత్రకు నాంది పలుకుతున్నాయి.

