అమ్మ ప్రేమలా… రక్తదానం జీవదానం”
తలసేమియా చిన్నారుల కోసం కదిలిన మానవత్వం
ప్రాణదాతలుగా మారిన 50 మంది ఖమ్మం వాకర్స్
కాకతీయ, ఖమ్మం టౌన్ : అమ్మ అంటే ఇచ్చేది.. ప్రాణం పోసేది. తొమ్మిది నెలలు రక్తాన్నే పాలగా మార్చి బిడ్డకు జన్మనిచ్చే ఆ తల్లి ప్రేమను స్మరించుకుంటూ, నిరుపేద తలసేమియా చిన్నారుల పాలిట తాము కూడా ‘అమ్మ’లమే అని నిరూపించారు ఖమ్మం నగర వాకర్స్. అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్‌లోని నడక సాధకుల కమిటీ ఆధ్వర్యంలో ఒక గొప్ప మానవీయ యజ్ఞం జరిగింది. కేవలం నడకతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా, మాతృమూర్తుల త్యాగానికి చిహ్నంగా, రక్తం కరువై కొట్టుమిట్టాడుతున్న నిరుపేద చిన్నారులకు తమ రక్తాన్ని అందించి ప్రాణదానం చేయాలన్న సంకల్పంతో 50 మంది సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని పంపారు. ఈ సందర్భంగా రాకం శ్యామ్ బాబు తదితరులు మాట్లాడుతూ.. “అమ్మ గర్భంలో ప్రాణం పోస్తుంది… రక్తదాతలు మరోసారి ఆ ప్రాణాన్ని నిలబెడతారు” అని భావోద్వేగంగా అన్నారు. “ఒక యూనిట్ రక్తం.. ఒక చిన్నారి జీవితానికి కొత్త ఊపిరిని పోస్తుంది. తలసేమియా చిన్నారులకు ప్రతి నెలా రక్తం అవసరమవుతుంది, అలాంటి పిల్లల కోసం ముందుకు వచ్చి రక్తదానం చేయడం నిజమైన మానవసేవ” అని పేర్కొన్నారు. యువత ఎక్కువగా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సంకల్ప సంస్థ సభ్యులు రవి, డాక్టర్ నారాయణమూర్తి, డాక్టర్ శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ రాంబాబు పాల్గొని రక్తదాతలను అభినందించారు. అలాగే వాకర్స్ కమిటీ సభ్యులు రామనాథం, రాకం శ్యామ్ మరియు పలువురు నడక సాధకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మాతృదినోత్సవం వేళ ఖమ్మం వాకర్స్ చాటిన ఈ మానవత్వం అందరినీ ఆలోచింపజేస్తోంది.

