లక్ష్యం ‘చెత్త’ పాలు
నిరుపయోగంగా సెగ్రిగేషన్ షెడ్లు
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారిన వైనం
కాకతీయ, మంగపేట : గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణతో పాటు చెత్త నుంచి ఆదాయం గడించాలనే ప్రభుత్వ లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం వల్ల అభాసుపాలవుతోంది. ఇంటింటి నుంచి సేకరించిన తడి, పొడి చెత్తను వేరు చేసి, దాని ద్వారా సేంద్రియ ఎరువును తయారు చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం నిర్మించిన ‘సెగ్రిగేషన్ షెడ్లు’ (చెత్త శుద్ధి కేంద్రాలు) మండలంలో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. లక్షలాది రూపాయల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన ఈ షెడ్లు నేడు అకేతనంగా మారి పిచ్చిమొక్కలకు, అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి. మండలంలోని 25 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ నిధుల నుంచి ఒక్కో షెడ్డుకు సుమారు రూ. 2.50 లక్షలు వెచ్చించి వీటిని నిర్మించారు. సేకరించిన చెత్తను ఇక్కడ శుద్ధి చేసి ఎరువుగా మార్చి, దానిని హరితహారం మొక్కలకు వాడటంతో పాటు రైతులకు విక్రయించి పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలని భావించారు. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పారిశుధ్య సిబ్బంది చెత్తను సేకరిస్తున్నప్పటికీ, తడి-పొడి విభజన జరగకపోవడంతో ఎరువు తయారీ ప్రక్రియ ఎక్కడా మొదలవ్వలేదు. ఫలితంగా ఈ షెడ్లు ఖాళీగా ఉండిపోయాయి. కొన్ని చోట్ల ఇవి ఊరికి చివరన ఉండటంతో రాత్రివేళల్లో మందుబాబులకు, ఆకతాయిలకు అడ్డాగా మారాయని స్థానికులు వాపోతున్నారు.
పర్యవేక్షణ కరవు
నిబంధనల ప్రకారం చెత్తను డంపింగ్ యార్డులకు తరలించి శుద్ధి చేయాల్సి ఉండగా, పంచాయతీ సిబ్బంది వాటిని రోడ్ల పక్కన, పాత గుంతల్లో పోసి తగలబెడుతున్నారు. దీనివల్ల వెలువడుతున్న కలుషిత పొగతో గ్రామస్తులు అనారోగ్యం బారిన పడుతున్నారు. అధికారులు మాత్రం ‘అవగాహన కల్పిస్తాం.. చర్యలు తీసుకుంటాం’ అంటూ ప్రకటనలకే పరిమితమవుతున్నారు తప్ప, ఒక్క షెడ్డును కూడా వినియోగంలోకి తెచ్చిన దాఖలాలు లేవని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రజాధనం వృథా కాకుండా సెగ్రిగేషన్ షెడ్లను వినియోగంలోకి తెచ్చి, సేంద్రియ ఎరువుల తయారీని ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.

