భద్రాద్రి జిల్లాలో ‘ఫేక్ ఫోన్‌పే’ కలకలం
రూ. 5 వేల సరుకులతో ఉడాయించిన కేటుగాడు
జిల్లాలో ఇది రెండో సంఘటన.. ఆందోళనలో వ్యాపారులు
కాకతీయ, భద్రాచలం (మణుగూరు) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ‘ఫేక్ ఫోన్‌పే’ ముఠా కలకలం రేపుతోంది. సాంకేతికతను ఆసరాగా చేసుకుని అమాయక వ్యాపారులను కేటుగాళ్లు నిలువునా ముంచుతున్నారు. తాజాగా భద్రాచలం పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానిక వ్యాపారులను ఉలిక్కిపడేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. భద్రాచలం పట్టణంలోని నెహ్రూ మార్కెట్ సమీపంలో ఉన్న ఒక కిరాణా దుకాణానికి ఒక అపరిచితుడు వచ్చాడు. సుమారు రూ. 5,000 విలువైన సరుకులను కొనుగోలు చేశాడు. నగదు చెల్లింపు సమయంలో తన మొబైల్లో ‘ఫేక్ ఫోన్‌పే’ యాప్‌ను ఉపయోగించి డబ్బులు పంపినట్లు స్క్రీన్‌పై చూపించాడు. సక్సెస్‌ఫుల్‌గా నగదు బదిలీ అయినట్లు వచ్చిన సందేశాన్ని చూసి, యజమాని నిజమేనని నమ్మాడు. సదరు వ్యక్తి సరుకులతో అక్కడి నుంచి వెళ్లిన తర్వాత, యజమాని తన బ్యాంక్ ఖాతాను తనిఖీ చేసుకోగా ఒక్క రూపాయి కూడా జమ కాలేదని గుర్తించి లబోదిబోమన్నాడు.
సీసీ కెమెరాల్లో నిందితుడి దృశ్యాలు
మోసపోయానని గ్రహించిన బాధితుడు దుకాణంలోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా, నిందితుడి దృశ్యాలు రికార్డయ్యాయి. వాటి ఆధారంగా నిందితుడి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. భద్రాచలం పట్టణంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. కస్టమర్లు ఆన్లైన్ పేమెంట్ చేసినప్పుడు కేవలం వారి మొబైల్ స్క్రీన్ చూడటమే కాకుండా, మీ మొబైల్‌కు మెసేజ్ వచ్చిందా? లేదా? అని సరిచూసుకోవాలి. ఫోన్‌పే, జీపే వంటి యాప్‌లకు ‘వాయిస్ అలర్ట్’ బాక్సులను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. గుర్తుతెలియని వ్యక్తులు పెద్ద మొత్తంలో సరుకులు కొని ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. వరుసగా జరుగుతున్న ఈ మోసాలతో మన్యం ప్రాంత వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు స్పందించి ఈ ఫేక్ యాప్‌ల ముఠాను పట్టుకోవాలని కోరుతున్నారు.

