గ్యాస్ సిలిండర్లకు ‘వీఐపీ’ భద్రత
లూటీ భయంతో ఎస్కార్ట్ మధ్య సరఫరా
మహబూబాబాద్ జిల్లా పెద్ద ముప్పారంలో అసాధారణ దృశ్యం
కాకతీయ, మహబూబాబాద్ : పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల సెగ సామాన్యుడి వంటగదికి తగిలింది. యుద్ధ మేఘాల కారణంగా దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో, సిలిండర్ల పంపిణీ ఇప్పుడు పోలీసుల కంచుకోట మధ్య సాగుతోంది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామంలో విఐపీల కాన్వాయ్ తరహాలో పోలీసు ఎస్కార్ట్ మధ్య గ్యాస్ సిలిండర్లను తరలించడం చర్చనీయాంశంగా మారింది. గ్యాస్ సిలిండర్ల లూటీ జరుగుతుందనే ముందస్తు ఆందోళనతో అధికారులు అత్యంత కఠినమైన భద్రతా చర్యలు చేపట్టారు. సిలిండర్లతో వెళ్తున్న నాలుగు ఆటోలకు ముందు ఒకటి, వెనుక ఒకటి చొప్పున పోలీసు జీపులు ఎస్కార్ట్గా వెళ్లాయి. ఇద్దరు సబ్-ఇన్స్పెక్టర్లు (ఎస్ఐలు), ఆరుగురు పోలీసుల పర్యవేక్షణలో ఈ సరఫరా ప్రక్రియ సాగింది. గ్యాస్ సిలిండర్ల కోసం పోలీసులు గస్తీ కాయడం స్థానికులను విస్మయానికి గురిచేసింది.
జాబితా ప్రకారమే పంపిణీ
గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణను పంపిణీ కేంద్రంగా ఎంచుకున్న పోలీసులు, చుట్టుపక్కల ఎవరూ రాకుండా పహారా కాశారు. ముందుగా గ్యాస్ బుక్ చేసుకున్న 170 మంది లబ్ధిదారుల జాబితాను పరిశీలించి, వారిని మాత్రమే అనుమతించి పంపిణీ పూర్తి చేశారు. ఎక్కడా తోపులాటలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిశితంగా పర్యవేక్షించారు. యుద్ధం కారణంగా గ్యాస్ దిగుమతులు తగ్గడం, స్టాక్ తక్కువగా ఉండటంతో వినియోగదారుల్లో ఆందోళన పెరిగింది. గత కొన్ని రోజులుగా పలు ప్రాంతాల్లో గ్యాస్ వాహనాలను దారిలో అడ్డుకుని, సిలిండర్లను బలవంతంగా లాక్కెళ్లడం, గొడవలకు దిగడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. సిలిండర్ల పంపిణీ సమయంలో గొడవలు జరిగే ప్రమాదం ఉందని డీలర్లు పోలీసులను ఆశ్రయించడంతో ఈ అసాధారణ భద్రత ఏర్పాటు చేశారు. గ్యాస్ సిలిండర్ల కోసం విఐపీ తరహాలో పోలీసులు కాపలా ఉన్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. యుద్ధం ప్రభావం నిత్యావసరాలపై ఎంతలా పడిందో చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

