దళితుల అభ్యున్నతికి మరింత కృషి చేయాలి
అంబేద్కర్ ఆశయ సాధనే ధ్యేయంగా సాగాలి
రాంసాగర్ సర్పంచ్ అక్కినపల్లి రాజ్యలక్ష్మి
కాకతీయ,కొమురవెల్లి: దళితుల అభ్యున్నతికి మరియు వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని కొమురవెల్లి మండలంలోని రాంసాగర్ గ్రామ సర్పంచ్ అక్కినపల్లి రాజ్యలక్ష్మి కోరారు. రాంసాగర్ గ్రామానికి చెందిన తాడూరి ఆనంద్, తాడూరి పర్శరాములు ఇటీవల ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ సుదర్శన్ చేతుల మీదుగా ‘దళిత రత్న’ అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, సర్పంచ్ మరియు పాలకవర్గ సభ్యులు అవార్డు గ్రహీతలను శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు దళితరత్న అవార్డులు రావడం సంతోషదాయకమన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేస్తూ, దళిత యువతకు మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో వారు మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ సుదర్శన్, ఉప సర్పంచ్ ఏసిరెడ్డి మల్లారెడ్డి, వార్డు సభ్యులు, మహిళా సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

