చెరువులపై మట్టి మాఫియా దండయాత్ర
చొప్పదండి నియోజకవర్గంలో జోరుగా మట్టి అక్రమ దందా
కోట్ల విలువైన మట్టిని కొట్టుకుపోతున్న మాఫియా కేటుగాళ్లు
ఇటుక బట్టీలకు చెరువు మట్టి.. ఒక్కో ట్రిప్పును వేలల్లో విక్రయం
గుమ్మాళాపూర్లో అటవీ భూముల్లోనూ తవ్వకాలు
ఫిర్యాదులందినా మౌనం వహిస్తున్న అధికారులు
దందాకు పూర్తిగా అధికారుల దండలున్నట్లుగా ప్రచారం
రూపురేఖలు కోల్పోతున్న జలాశయాలు.. రైతాంగం తీవ్ర ఆందోళన
కాకతీయ, కరీంనగర్ /చొప్పదండి : కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు, అటవీ ప్రాంతాలు సైతం మట్టి మాఫియా కబంధహస్తాల్లో చిక్కుకున్నాయి. నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టి యంత్రాలతో పగలు, రాత్రి తేడా లేకుండా మట్టిని తరలిస్తున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల రాయల్టీ ఆదాయం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తోందన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెరువులు లేదా ప్రభుత్వ భూముల నుంచి మట్టిని తరలించాలంటే గనులు, రెవెన్యూ, నీటిపారుదల శాఖల అనుమతులు తప్పనిసరి. కానీ చొప్పదండి నియోజకవర్గంలో ఈ నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒక ట్రాక్టర్ మట్టికి అనుమతి తీసుకుని వంద రెట్లు అధికంగా మట్టిని తరలిస్తున్నట్లు చెబుతున్నారు.

ఇటుక బట్టీలకు చెరువు మట్టి
అక్రమంగా తవ్విన చెరువు మట్టిని ప్రధానంగా ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. చొప్పదండి పరిసర ప్రాంతాల్లోని ఇటుక బట్టీల నిర్వాహకులతో మట్టి మాఫియా భారీ ఒప్పందాలు కుదుర్చుకుందని సమాచారం. చెరువులోనే లారీలు, టిప్పర్లు లోడ్ చేసి ఇచ్చినందుకు ఒక్కో ట్రిప్పుకు నాలుగు వేల ఐదు వందల రూపాయల నుండి ఎనిమిది వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రోజుకు వందలాది ట్రిప్పులు సాగుతుండటంతో ఈ దందా కోట్ల టర్నోవర్కు చేరిందని ప్రచారం జరుగుతోంది. చొప్పదండి మండలంలోని కాట్నపల్లి, దేశాయిపేటతో పాటు గంగాధర మండలం కురిక్యాల గ్రామాల్లో చెరువులు రూపురేఖలు కోల్పోతున్నాయి. చెరువుల లోతు అసహజంగా పెరగడంతో వర్షాకాలంలో కట్టలు తెగిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అటవీ భూములపైనా తవ్వకాలు
చొప్పదండి మండలంలోని గుమ్మాళాపూర్ గ్రామంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. సుమారు ఐదు ఎకరాల అటవీ భూమిలో అనుమతులు లేకుండానే చెట్లను నరికివేసి మట్టిని తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పచ్చని చెట్లను కూల్చి ప్రకృతిని ధ్వంసం చేస్తున్నా అటవీ శాఖ అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. అక్రమ తవ్వకాలపై ప్రశ్నించిన గ్రామస్తులను మాఫియా ముఠాలు బెదిరిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాకు పెద్దల అండ ఉంది, ఎక్కడ చెప్పుకున్నా ఏమీ చేయలేరు అంటూ బహిరంగ హెచ్చరికలు చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.
అధికారుల మౌనం.. ప్రజాప్రతినిధుల అండ
మట్టి దందా వెనుక ఓ సిండికేట్ వ్యవస్థ పనిచేస్తోందన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. స్థానిక పోలీస్, రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ శాఖల అధికారులకు మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకే భారీగా మట్టి తరలింపులు జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏ చెరువులో తవ్వకాలు జరపాలన్నా ముందుగా రాజకీయంగా గ్రీన్ సిగ్నల్ తీసుకోవాల్సిందేనన్న ప్రచారం కూడా సాగుతోంది. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారిన తర్వాతే జేసీబీలు రంగంలోకి దిగుతున్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. ಅక్రమ మట్టి తవ్వకాల వల్ల భూగర్భ జలాల మట్టం పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ లోడుతో వెళ్లే లారీలు, టిప్పర్ల కారణంగా గ్రామీణ రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ధూళి కాలుష్యంతో ప్రజలు శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు. గుమ్మాళాపూర్, కాట్నపల్లి, దేశాయిపేట, కురిక్యాల గ్రామాల్లో జరిగిన తవ్వకాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

