గిరిజన చెరువుల్లో గిరిజనేతరుల చేపల వేట
11.50 టన్నుల చేపల దోపిడీ జరిగిందంటూ ఆదివాసీల ఆరోపణలు
చర్యలు చేపట్టాలని ‘తుడుందెబ్బ’ డిమాండ్.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
కాకతీయ, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం షాపల్లి పంచాయతీ పరిధిలోని పెద్ద చెరువులో గిరిజన మత్స్యకారుల సొసైటీ హక్కులను ఉల్లంఘిస్తూ గిరిజనేతరులు చేపల అక్రమ వేట కొనసాగిస్తున్నట్లు ఆదివాసీ సంఘాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. పెసా చట్టం కింద గ్రామసభ తీర్మానం ద్వారా గిరిజన మత్స్యకారులకే ఈ చెరువును కేటాయించారని, అయినప్పటికీ కొందరు గిరిజనేతరులు నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ చేపలు పడుతున్నారని వారు పేర్కొన్నారు. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో గిరిజన సొసైటీకి అప్పగించిన ఈ పెద్ద చెరువులో సుమారు 30 వేల చేపల పిల్లలను వదిలినట్లు సొసైటీ ప్రతినిధులు తెలిపారు. అయితే, గిరిజనేతరులు దౌర్జన్యంగా వేట కొనసాగిస్తూ ఇప్పటివరకు సుమారు 11 టన్నుల 50 కిలోల (11.50 టన్నులు) చేపలను అక్రమంగా పట్టుకెళ్లారని ఆరోపించారు. ఈ విషయమై అధికారులు గతంలో పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ అక్రమ వేట ఆగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వనరుల రక్షణలో అధికారులు విఫలం
ఈ ఘటనపై ఆదివాసి హక్కుల పోరాట సమితి ‘తుడుం దెబ్బ’ రాష్ట్ర కార్యదర్శి కోరగట్ల లక్ష్మణరావు మాట్లాడుతూ.. గిరిజనులకు చట్టబద్ధంగా కేటాయించిన సహజ వనరులను రక్షించడంలో సంబంధిత అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. గిరిజన చెరువుల్లో గిరిజనేతరుల జోక్యాన్ని తక్షణమే నిలిపివేయాలని, లేనిపక్షంలో తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ విషయమై గిరిజన మత్స్యకారుల సొసైటీ అధ్యక్షుడు కోరగట్ల లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు యాలం దేవేందర్, యాలం నారాయణ, యాలం క్రాంతికుమార్, పాయం సుబ్బు తదితరులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంపై ఆదివాసీ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గిరిజనేతరుల అక్రమాలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుని గిరిజన సొసైటీ హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఏటూరునాగారం, తాడ్వాయి, వెంకటాపురం, కన్నాయిగూడెం మండలాలకు చెందిన ఆదివాసీ నాయకులు, కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు.

