కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా అరుణ్‌కుమార్
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా కొరివి అరుణ్‌కుమార్‌ను రెండోసారి నియమించారు. న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఇందిరా భవన్‌లో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఆయనకు ఈ నియామక పత్రాన్ని అందజేశారు. ఏఐసీసీ ఎస్సీ విభాగం జాతీయ అధ్యక్షుడు రాజేంద్రపాల్ గౌతమ్, తెలంగాణ ఎస్సీ విభాగం అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా అరుణ్‌కుమార్ ఈ పత్రాన్ని అందుకున్నారు. ఈ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నూతన జిల్లా అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో రెండోసారి బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు తన నియామకానికి సహకరించిన డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ జిల్లా ఎస్సీ విభాగాన్ని రాష్ట్రంలోనే ముందంజలో నిలిపేందుకు శ్రమిస్తానని, త్వరలోనే జిల్లా కమిటీలను ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు.

