పల్లెలకు కేంద్రం భారీ ఊరట
16వ ఆర్థిక సంఘం నిధుల్లో పంచాయతీలకే పెద్దపీట
80 శాతం నిధులు నేరుగా గ్రామల ఖాతాల్లోకే
దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు.. నిధుల నిలిపివేత
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. 16వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులో గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తూ కేంద్రం కీలక మార్పులు చేపట్టింది. గతంతో పోలిస్తే ఈసారి నేరుగా గ్రామ పంచాయతీలకే సింహభాగం నిధులు కేటాయించడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తం విడుదలయ్యే నిధుల్లో సుమారు 80 శాతం నిధులను నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లోనే జమ చేయనుండగా.. మిగిలిన 20 శాతం నిధులను జిల్లా పరిషత్, మండల పరిషత్ సంస్థలకు కేటాయించనున్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్యల పరిష్కారం, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులను వినియోగించనున్నారు. జిల్లాలో ఇప్పటికే అనేక గ్రామ పంచాయతీలు నిధుల కొరతతో పనులను నిలిపివేసిన పరిస్థితుల్లో.. కేంద్రం తాజా నిర్ణయంతో గ్రామాభివృద్ధి పనులకు మళ్లీ ఊపు రానుంది.
ఆన్లైన్లో లెక్కలు.. నిఘా కఠినం
నిధుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టనుంది. ప్రతి రూపాయి ఖర్చుకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా నిధులు దుర్వినియోగం చేస్తే తదుపరి విడత నిధులను నిలిపివేస్తామని కేంద్రం గట్టిగా హెచ్చరించింది. ఈ నిర్ణయంతో జిల్లాలో పెండింగ్లో ఉన్న పలు గ్రామాభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తవుతాయని ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

