రెండు రోజుల్లో ధాన్యం కొనాలి
లేదంటే అధికారుల ఇళ్ల ముందు పోస్తాం
ప్రభుత్వ అలసత్వంపై మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం
నగునూరు, చేగుర్తి కొనుగోలు కేంద్రాల పరిశీలన
అడిషనల్ కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి గోదాం కేటాయింపు
కాకతీయ, కరీంనగర్ : వరి ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రెండు రోజుల్లో కరీంనగర్ నియోజకవర్గంలోని రైతుల ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయకపోతే.. జిల్లా అధికారుల ఇళ్ల ఎదుట ధాన్యం పోసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. బుధవారం కరీంనగర్ రూరల్ మండలంలోని నగునూరు, చేగుర్తి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నెలన్నరగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో పాటు, ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిసి నష్టపోయామని రైతులు ఎమ్మెల్యే ముందు కన్నీటి పర్యంతమయ్యారు. రైతుల ఆవేదనపై స్పందించిన గంగుల.. వెంటనే జిల్లా అదనపు కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి ఏఎంసీలోని గోదాం నంబర్-7ను ధాన్యం నిల్వకు కేటాయించాలని కోరారు. సివిల్ సప్లై అధికారులను కొనుగోలు కేంద్రానికి పిలిపించి సమస్యలపై నిలదీశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే హమాలీలు, రవాణా వాహనాల కొరత ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. గ్రామంలోని ట్రాక్టర్లను రవాణాకు వినియోగించేలా, హమాలీలను సమీకరించి ధాన్యం తరలించేలా దగ్గరుండి చర్యలు చేపట్టారు. అనంతరం చేగుర్తి గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం కుప్పలను చూసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ధైర్యం చెబుతూ, దగ్గరుండి ధాన్యానికి కాంటా వేయించి రైస్ మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మే 5లోపు కొనుగోళ్లు పూర్తి చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేవాళ్లమని, కానీ కాంగ్రెస్ పాలనలో మే చివరికి వచ్చినా సగం ధాన్యం కూడా కొనలేకపోయారని విమర్శించారు. కొనుగోళ్లలో రైస్ మిల్లర్లు, అధికారులపై ప్రభుత్వానికి నియంత్రణ లేకుండా పోయిందని మండిపడ్డారు. రెండు రోజుల్లో తడిసిన, తడవని ప్రతి గింజను కొనుగోలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్లు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, తోట తిరుపతి, డైరెక్టర్లు లక్ష్మయ్య, సుంకిశాల సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.

