ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
ఇల్లంతకుంటలో ఎమ్మెల్యే కవ్వంపల్లి
కాకతీయ, ఇల్లంతకుంట: మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో విస్తృతంగా పర్యటించారు. కందికట్కూర్ గ్రామంలో నిర్వహిస్తున్న ఎల్లమ్మ తల్లి జాతరలో పాల్గొని ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థించారు. అనంతరం ఇల్లంతకుంట మార్కెట్ యార్డును సందర్శించిన ఎమ్మెల్యే.. ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిని పరిశీలించి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. కొనుగోళ్లలో జాప్యం, తూకం, చెల్లింపుల ఆలస్యంపై రైతులు తెచ్చిన సమస్యలపై అక్కడికక్కడే అధికారులతో సమీక్షించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు వేగవంతంగా, పారదర్శకంగా జరపాలని ఆదేశించారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మండలంలోని వెళ్జీపూర్ గ్రామంలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన పలువురి కుటుంబాలను ఎమ్మెల్యే కవ్వంపల్లి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ.. ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

