బస్సుల ఫిట్నెస్‌పై రాజీ లేదు
జిల్లా విద్యాధికారి అల్లం సిద్ధార్థ రెడ్డి
కాకతీయ, ములుగు ప్రతినిధి:విద్యార్థుల భద్రతను అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుంటూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల బస్సుల ఫిట్నెస్‌పై కఠిన పర్యవేక్షణ చేపట్టనున్నట్లు జిల్లా విద్యాధికారి అల్లం సిద్ధార్థ రెడ్డి తెలిపారు. పాఠశాల బస్సులు రోడ్లపై నడవాలంటే తప్పనిసరిగా మోటార్ వెహికల్ డిపార్ట్‌మెంట్ నుంచి చెల్లుబాటు అయ్యే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలని స్పష్టం చేశారు. ఫిట్నెస్ లేకుండా బస్సులు నడపడం పూర్తిగా నిషేధమని హెచ్చరించారు. డ్రైవర్లు సరైన లైసెన్స్ కలిగి ఉండటంతో పాటు, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. బస్సుల్లో విద్యార్థుల భద్రత కోసం ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్, STOP బోర్డు వంటి భద్రతా సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రతి పాఠశాల యాజమాన్యం తమ బస్సుల ఫిట్నెస్, ఇన్సూరెన్స్, డ్రైవర్ వివరాలను విద్యాశాఖకు సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. విద్యార్థుల ప్రాణ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని అధికారులు తెలిపారు. విద్యార్థుల భద్రత విషయంలో రాజీ లేదు అని, ప్రతి బస్సు సురక్షితంగా ఉండేలా పాఠశాలలు బాధ్యత వహించాలి అని, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ప్రయాణించే బస్సుల పరిస్థితిని తెలుసుకోవాలి అని జిల్లా విద్యాధికారి అల్లం సిద్ధార్థ రెడ్డి పేర్కొన్నారు.

