ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటానికి సిద్ధం కావాలి
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలం
: మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
సంగెం, గీసుగొండ మండలాల సర్పంచులు, ఉపసర్పంచులతో విస్తృత స్థాయి సమీక్ష
కాంగ్రెస్ పార్టీని వీడి భారీగా బీఆర్ఎస్లో చేరిన యువజన నాయకులు
కాకతీయ, పరకాల/ గీసుగొండ : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటానికి పార్టీ శ్రేణులంతా సిద్ధం కావాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. గ్రామాల్లో నెలకొన్న కనీస సమస్యలపై ప్రజలతో నిరంతరం మమేకమవుతూ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. శనివారం హనుమకొండలోని తన నివాసంలో సంగెం, గీసుగొండ మండలాలకు చెందిన మాజీ సర్పంచులు, ఉపసర్పంచులతో ఆయన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై సుదీర్ఘంగా సమీక్షించారు.
ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు మోసం
ఈ సమావేశంలో చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఆరు గ్యారంటీల ఆశ చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, నేడు ప్రజలకు సమాధానం చెప్పలేని దయనీయ పరిస్థితిలో ఉందన్నారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలను ఈ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా స్తంభించిపోయిందని, పల్లెల్లో సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల (స్పెషల్ ఆఫీసర్స్) పాలన అస్తవ్యస్తంగా మారిందని, అవ నీతి, అవకతవకలు జరుగుతున్నాయని సర్పంచులు తన దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు.
గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అద్భుతమైన ప్రగతిని చూసి ప్రజలు మళ్లీ గులాబీ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని ధర్మారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఇంటింటికీ తీసుకెళ్లడంతో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్ఐఆర్ ఓటర్ల వెరిఫికేషన్ కార్యక్రమంపై పార్టీ శ్రేణులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, పేదల ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ శ్రేణుల వలసలు
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పరకాల మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ యూత్ ప్రధాన కార్యదర్శి ఆలేటి శ్రావణ్ కుమార్, కీలక నాయకుడు ఐరబోయిన అజయ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం కాంగ్రెస్ పార్టీని వీడారు. బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు యాట వీరస్వామి ఆధ్వర్యంలో వీరంతా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకోగా, ఆయన వారికి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కొన్ని నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, రానున్న రోజుల్లో మరిన్ని భారీ చేరికలు ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, గ్రామ పెద్దలు, యువజన విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.

