ఇందిరమ్మ ఇళ్లతో కొత్త జీవితానికి శ్రీకారం
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
సిరికొండలో ఎనిమిది ఇళ్ల ప్రారంభం
కాకతీయ, ఇల్లంతకుంట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం ద్వారా పేద కుటుంబాల సొంతింటి కల సాకారమవుతోందని మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ విభాగం (సెల్) చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఇల్లంతకుంట మండలం సిరికొండ గ్రామంలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఎనిమిది మంది లబ్ధిదారులు మంగళవారం సామూహిక గృహప్రవేశాలు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ఇళ్లను ప్రారంభించారు. లబ్ధిదారులు పయ్యావుల లక్ష్మి, పయ్యావుల లచ్చవ్వ, తిప్పరవేణి లత, తిప్పరవేణి బాలక్ష్మి, కోల మహేశ్వరి, నీలం మౌనిక, ఉమ్మరవేణి లచ్చవ్వ, గొల్లపల్లి నరేష్‌లు తమ కుటుంబ సభ్యులతో కలిసి సాంప్రదాయబద్ధంగా నూతన గృహాల్లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సొంత ఇల్లు ప్రతి కుటుంబానికి ఒక భద్రతా కవచం లాంటిదని, పేదలకు గౌరవప్రదమైన జీవనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని చెప్పారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి రామకృష్ణ, ఎంపీడీఓ శశికళ, తహసీల్దార్ సురేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు ఊట్కూరి వెంకటరమణారెడ్డి, గుడిసె అయిలయ్య, సర్పంచ్ గొడుగు విఠల్ పాల్గొన్నారు.

