అంతా మీ ఇష్టమేనా కవ్వంపల్లి..?’
పార్టీకి చెప్పకుండానే కమిటీ ఎలా?
ఎమ్మెల్యే కవ్వంపల్లి పై మీనాక్షి ఆగ్రహం
రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ నియామకాల వ్యవహారంపై రచ్చ
సీనియర్లను పక్కన పెట్టారని అధిష్ఠానానికి ఫిర్యాదులు
కరీంనగర్ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ
ఏకపక్ష నిర్ణయాలతో పార్టీకి నష్టమన్న ఏఐసీసీ ఇన్‌చార్జి
కాకతీయ, కరీంనగర్ : రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ కమిటీ నియామకాల వ్యవహారం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ పెద్దలకు, పీసీసీ నాయకత్వానికి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా కమిటీని ప్రకటించడంపై ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తీరుపై ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, మహిళా కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ సెల్ నాయకుల సమీక్షా సమావేశంలో మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ సెల్ కమిటీ నియామకాల్లో తమకు అవకాశం కల్పించలేదని, సీనియర్ నాయకులను పక్కన పెట్టారని పలువురు నేతలు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు.
కరీంనగర్ కాంగ్రెస్‌లో జోరుగా చర్చ..!
ఎస్సీ సెల్ కమిటీ ప్రకటనకు ముందు జిల్లాలోని పార్టీ సీనియర్లతో ఎలాంటి సంప్రదింపులు జరగలేదన్న చర్చ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కొందరు నేతలు నేరుగా అధిష్ఠానానికి ఫిర్యాదులు చేయడంతో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వ్యవహారంపై ఆరా తీసిన మీనాక్షి నటరాజన్.. పార్టీ నాయకత్వంతో చర్చించకుండా కమిటీని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించినట్లు సమాచారం. ఇలాంటి నిర్ణయాలు పార్టీలో అసంతృప్తికి దారితీస్తాయని, సీనియర్లకు అన్యాయం జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోందని ఆమె మండిపడ్డారు. కమిటీల ఏర్పాటులో సమన్వయం అవసరమని, కొత్తవారికి 30 శాతం, అనుభవజ్ఞులకు 70 శాతం ప్రాతినిధ్యం కల్పించే విధంగా కమిటీలను పునర్వ్యవస్థీకరించాలని ఆమె సూచించారు.
జిల్లాల పర్యటనలకు దిశానిర్దేశం
ఇదే సమావేశంలో అనుబంధ విభాగాల భవిష్యత్ కార్యాచరణపైనా చర్చ జరిగింది. యువజన కాంగ్రెస్‌ను గ్రామ స్థాయికి విస్తరించాలని, మహిళా నాయకులను ఓటరు జాబితా ప్రక్షాళన కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని ఆదేశించారు. అలాగే ఎస్టీ సెల్ అధ్యక్షుడు శంకర్ నాయక్ జిల్లాల వారీగా పర్యటించి గిరిజన, లంబాడ, ఆదివాసీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేలా కార్యాచరణ రూపొందించాలని అధిష్ఠానం దిశానిర్దేశం చేసింది.

