ఖమ్మం పోలీసులకు వరంగల్ సీపీ అభినందనలు
చోరీ కేసు ఛేదించిన సీసీఎస్ పోలీసులకు ప్రత్యేక అభినందనలు
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముగ్గురు అంతర్రాష్ట్ర నేరస్థుల అరెస్ట్
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన వరంగల్ పోలీసులు
ఖమ్మం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల్లా ఎక్కి నిందితుల పట్టివేత
సకాలంలో స్పందించి సహకరించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు
కాకతీయ, ఖమ్మం బ్యూరో : హన్మకొండ జిల్లా కేయూసీ పోలీస్ స్టేషన్‌లో నమోదైన మూడు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముగ్గురు అంతర్రాష్ట్ర నేరస్థులను పట్టుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించిన ఖమ్మం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ గురువారం అభినందించారు. ఇటీవల వరంగల్ జిల్లా కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. నిందితులు చోరీ సొత్తుతో ఖమ్మం మీదుగా వెళ్లే రైల్లో పారిపోతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వరంగల్ పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారు. వెంటనే ఖమ్మం జిల్లా పోలీసులకు సమాచారం అందించారు.
చాకచక్యంగా పట్టుకున్నారు
ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వెంటనే సిబ్బందిని ఆదేశించారు. ఖమ్మం జిల్లా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిబ్బంది రంగంలోకి దిగారు. వారు ప్రయాణికుల్లాగా ఖమ్మంలో రైలు ఎక్కారు. ప్రతి రైలు భోగిని క్షుణ్ణంగా పరిశీలించారు. రైలు మధిరకు వచ్చే సరికి ముగ్గురు నిందితులను గుర్తించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఎస్కే ఫిరోజ్, ఎస్కే ఎమిన్, ఎస్కే సుఖ్‌చంద్‌లను చాకచక్యంగా పట్టుకున్నారు. వారిని వరంగల్ జిల్లా పోలీసులకు అప్పగించారు. ఖమ్మం పోలీసులు సకాలంలో స్పందించి అమూల్యమైన సహకారం అందించారు. దీనికి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన పంపిన ప్రశంసా పత్రాన్ని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చేతుల మీదుగా సిబ్బందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, సీసీఎస్ ఏసీపీ సర్వర్ పాల్గొన్నారు.

