నిషేధిత ప్రాంతాల్లో పొగాకు విక్రయిస్తే జైలు
విద్యాసంస్థల సమీపంలో విక్రయాలపై నిత్యం నిఘా
ఆపరేషన్ సేఫ్ స్కూల్ ద్వారా ప్రత్యేక తనిఖీలు
యువత వ్యసనాల బారిన పడకుండా సమాజం అప్రమత్తత
నిబంధనలు ఉల్లంఘిస్తే కోట్పా జువెనైల్ చట్టాల కింద శిక్ష
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ హెచ్చరిక
కాకతీయ, హనుమకొండ : పాఠశాలలు కళాశాలలు ఇతర విద్యాసంస్థల పరిసరాల్లో గుట్కా, సిగరెట్లు తదితర పొగాకు ఉత్పత్తులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ హెచ్చరించారు. విద్యాసంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాన్ని పూర్తిగా నిరోధించేందుకు కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరుతో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు చెడు అలవాట్ల బారిన పడకుండా చర్యలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయం నిషేధమని తెలియజేస్తూ రూపొందించిన గోడపత్రికను పోలీస్ కమిషనర్ ఆవిష్కరించారు.
ప్రత్యేక నిఘా ఏర్పాటు
ముఖ్యంగా స్కూళ్లు కాలేజీల పరిసరాల్లో ఉన్న పాన్‌షాపులు ఇతర దుకాణాల ద్వారా మైనర్లకు గుట్కా సిగరెట్లు విక్రయించకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని యువత మాదకద్రవ్యాలు ఇతర వ్యసనాల బారిన పడకుండా సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యాసంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తులు విక్రయించే వారిపై సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్-2003 కింద చర్యలు తీసుకుంటామని తెలిపారు. మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయించినట్లయితే జువెనైల్ జస్టిస్ యాక్ట్-2015 సెక్షన్ 77 ప్రకారం చట్టపరమైన చర్యలు తప్పవని సన్‌ప్రీత్ సింగ్ హెచ్చరించారు. ఎవరైనా విద్యాసంస్థల వద్ద పొగాకు ఉత్పత్తుల విక్రయాలను గమనిస్తే స్థానిక పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-100కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డి, సీసీఆర్‌బీ ఏసీపీ డేవిడ్ రాజు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సుజాత, ఏఎస్సై రాజేందర్ ప్రసాద్ పాల్గొన్నారు.

