ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామ ప్రగతి సాధ్యం
ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక గ్రామ సభలు
ప్రభుత్వ బడిబాట ద్వారా విద్యార్థుల నమోదు పెంచాలి
మర్రిమడ్ల గ్రామసభలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
ఘన వ్యర్థాల నిర్వహణ, పంట మార్పిడిపై అవగాహన
కాకతీయ, వేములవాడ : గ్రామ ప్రగతి, అభివృద్ధిపై చర్చించుకోవడానికి ప్రత్యేక గ్రామ సభలు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధికి సరైన కార్యాచరణ, ప్రణాళిక రూపొందించవచ్చని తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్షాకాల సన్నద్ధత, పంట మార్పిడి, పారిశుద్ధ్యం, బడిబాట, ఓటరు జాబితా సవరణ తదితర అంశాలపై ప్రజలతో చర్చించారు.
చెత్తను నాలుగు రకాలుగా వేరు చేయాలి
వర్షాకాలానికి ముందే గ్రామాల్లోని డ్రైనేజీలు శుభ్రం చేయడం గ్రామ పంచాయితీ బాధ్యత అని కలెక్టర్ తెలిపారు. డ్రైనేజీల్లో ప్లాస్టిక్, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయవద్దని కోరారు. ఘన వ్యర్థాల నిర్వహణ-2026 పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. చెత్తను తడి, పొడి, సానిటరీ, ప్రత్యేక చెత్తగా నాలుగు రకాలుగా వేరు చేసి పంచాయితీ వాహనానికి అందించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తాగునీటి ట్యాంకులను క్రమం తప్పకుండా బ్లీచింగ్‌తో శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు.
రైతులు పంట మార్పిడి చేయాలి
రైతులు లాభదాయకమైన ఆయిల్ పామ్, కూరగాయలు, పత్తి పంటలను సాగు చేయాలని కలెక్టర్ సూచించారు. వరిలో సన్న వడ్లను సాగు చేస్తే ప్రభుత్వం బోనస్ అందిస్తుందని తెలిపారు. పంట మార్పిడి చేయకపోతే నేల సారం తగ్గుతుందనే విషయాన్ని రైతులు గమనించాలన్నారు. రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని కోరారు. ఈ నెల 25 నుండి ప్రారంభమయ్యే ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు ప్రజలు బీఎల్ఓలకు సహకరించాలన్నారు. బడిబాట ద్వారా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పెంచాలని కోరారు. అనంతరం గ్రామంలోని నర్సరీ, కంపోస్ట్ షెడ్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కుమారి, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

