లక్షలు నొక్కేసి నన్ను రోడ్డున పడేశారు!
పైసుల తీసుకుని నా ప్రాణం మీదికి తెచ్చారు
ఉపాధి హామీ పేరిట నన్ను నమ్మించి ముంచిన ట్రైబల్ సొసైటీలు, నేతలు
ఆస్తులన్నీ అమ్ముకున్నా.. టెన్షన్లతో కిడ్నీలు ఫెయిలై డయాలిసిస్ బెడ్‌పై బతుకుతున్నా!
నాడు టీఆర్ఎస్ నేతలు బెదిరించారు.. నేడు కాంగ్రెస్ లీడర్లు ముంచారు
ములుగు కలెక్టరేట్ ముందే రూ. 38 లక్షలు తీసుకుని బాలకృష్ణ మోసం
డీసీసీ ప్రెసిడెంట్ అశోక్ పాత్రపై విచారణ జరపాలి
కలెక్టర్, ఏఎస్పీ సార్లు.. నా గోడు ఆలకించండి..
న్యాయం జరక్కపోతే ఆత్మహత్యే శరణ్యం!
బెల్లకొండ వెంకటేశ్వర్ రావు కన్నీటి వాంగ్మూలం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : “ఉపాధి హామీ పేరిట ట్రైబల్ సొసైటీలను ఏర్పాటు చేసి, ఇసుక రీచుల సబ్-కాంట్రాక్టు ఇప్పిస్తామంటూ రాజకీయ నాయకులు, సొసైటీల ప్రతినిధులు నన్ను నమ్మించి నిలువునా ముంచేశారు. నా రెక్కల కష్టాన్ని, స్థిర, చర ఆస్తులను దోచుకుని నన్ను రోడ్డున పడేశారు. ఈ మోసాలు, టెన్షన్ల భారం తట్టుకోలేక నా రెండు కిడ్నీలు పాడైపోయి, వారానికి రెండుసార్లు డయాలిసిస్ చేయించుకుంటూ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నా. ఇంత జరుగుతున్నా దగాకోరు ముఠాకు కనీసం జాలి కలగడం లేదు” అంటూ మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడకు చెందిన ఇసుక రీచుల కాంట్రాక్టర్ బెల్లకొండ వెంకటేశ్వర్ రావు (భాస్కర్ రావు) మీడియాకు తన ఆవేదనను కన్నీటి వాంగ్మూలంగా వెళ్లబోసుకున్నారు. తనను దశాబ్ద కాలంగా వంచించారంటూ బాధితుడు వెంకటేశ్వర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.. ఆ వివరాలు ఆయన మాటల్లోనే సవివరంగా…

నాడు నమ్మి సొసైటీకి రూ. 8 లక్షలు ఇచ్చా.. తీరా పర్మిషన్ వచ్చాక దగా చేశారు!
“నేను 2010 నుంచి ఇసుక రీచుల కాంట్రాక్టర్‌గా జీవనం సాగిస్తున్నాను. ఈ క్రమంలోనే ములుగు జిల్లా మంగపేట మండలం చుంచుపల్లి గ్రామానికి చెందిన ‘చుంచులక్ష్మి ట్రైబల్ సొసైటీ’ అధ్యక్షుడు కోరం అబ్బయ్య నన్ను సంప్రదించాడు. ఇసుక రీచు నిర్వహణకు అనుమతి రాగానే సబ్-కాంట్రాక్ట్ నాకే ఇస్తానని గట్టిగా నమ్మబలికాడు. ఆ మాటలు నమ్మి సొసైటీ రిజిస్ట్రేషన్ కోసం నా జేబులోంచి రూ. 8 లక్షలు వాళ్లకు ఇచ్చాను. అందులో ఉన్న 360 మంది సభ్యులకు బ్యాంక్ అకౌంట్లు తీయించడంతో పాటు రిజిస్ట్రేషన్ చలాన్లు నేనే కట్టాను. క్వారీ పర్మిషన్ కోసం నా సొంత ఖర్చులతో ఆ గ్రామస్థులను పదిసార్లు హైదరాబాద్‌లోని అప్పటి ఏపీఎండీసీ, మైనింగ్ ఎండీల వద్దకు తీసుకెళ్లి దరఖాస్తులు ఇప్పించాను. దాదాపు రెండేళ్ల పాటు గ్రామస్థుల అవసరాలన్నీ నేనే చూసుకుంటూ క్వారీ అనుమతి తీసుకొచ్చాను. తీరా పర్మిషన్ వచ్చిన తర్వాత నా శ్రమను మర్చిపోయి, ఇతరుల వద్ద డబ్బులు తీసుకుని సబ్ కాంట్రాక్టు అగ్రిమెంట్ చేసుకుని నన్ను ఘోరంగా మోసం చేశారు. ఈ టెన్షన్ వల్ల నేను తీవ్ర మనోవేదనకు గురై మొట్టమొదటిసారి షుగర్ వ్యాధి బారిన పడ్డాను.”
బీఆర్ఎస్ నేతలు బెదిరించారు.. ప్రాణాలు పోయే స్థితికి తెచ్చారు!
“ఆ తర్వాత 2018లో సొసైటీ ప్రతినిధులు రెండు కార్లలో దేవులవాడలోని మా ఇంటికి వచ్చారు. నేను ఆస్తులు అమ్ముకుని నష్టపోయిన విషయం తెలుసుకుని, ‘మళ్లీ క్వారీ పర్మిషన్ తెచ్చుకుంటే సబ్-కాంట్రాక్ట్ మీకే ఇస్తాం’ అని కొత్తగా అగ్రిమెంట్ రాసిచ్చారు. వారిని నమ్మి మళ్లీ మూడేళ్ల పాటు తిరిగి చుంచుపల్లి ఇసుక రీచుల కోసం అనుమతులు తీసుకొచ్చాను. కానీ అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే చందూలాల్, ఆయన కొడుకు ప్రహ్లాద్‌లు నన్ను, సొసైటీ ప్రతినిధులను తీవ్రంగా బెదిరించి ఆ ఇసుక రీచులను బలవంతంగా ఇతరులకు కట్టబెట్టారు. ప్రహ్లాద్ నన్ను హెచ్చరిస్తూ.. ‘మా ప్రాంతంలోకి వస్తే బాగుండదు’ అని ప్రాణ భయం కలిగించాడు. ఈ టెన్షన్ తట్టుకోలేక నా బీపీ పెరిగి కంటి వ్యాధుల బారిన పడ్డాను. 2020లో కిడ్నీలు పూర్తిగా పాడైపోవడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. వైద్యులు వారానికి రెండుసార్లు డయాలిసిస్ చేయాలని చెప్పడంతో, 2023 వరకు నేను ఆసుపత్రులకే పరిమితమై బతికానా చనిపోయానా అన్నట్లు ఉన్నాను.”
కలెక్టరేట్ ముందే కాంగ్రెస్ లీడర్ బాలకృష్ణకు రూ. 38 లక్షల నగదు ఇచ్చా!
“నేను కోలుకున్నాక 2023లో సొసైటీ ప్రతినిధులు మళ్లీ గ్రామానికి పిలిచి ఇసుక రీచులు ఇస్తామన్నారు. 2024లో చుంచులక్ష్మి, నరసింహస్వామి సొసైటీల ప్రతినిధులు మళ్లీ నాకు అగ్రిమెంట్ రాసిచ్చారు. అయితే గతంలో రెండుసార్లు మోసపోయినందున, ఈసారి రమణక్కపేటకు చెందిన కాంగ్రెస్ నాయకుడు కొండం బాలకృష్ణను కలిసి సాయం కోరాను. బాలకృష్ణ నన్ను డీసీసీ అధ్యక్షుడు అశోక్ గారి వద్దకు తీసుకెళ్లగా, నా అనారోగ్యాన్ని చూసి ఆయన సానుభూతి చూపించారు. రెండు క్వారీలు (6, 10 పాయింట్లు) చేసుకోమని, అధికారులతో తాను చెప్తానని హామీ ఇస్తూ ఆ బాధ్యతలను బాలకృష్ణకు అప్పగించారు. ఆ నమ్మకంతో నేను బాలకృష్ణకు, చుంచులక్ష్మి సొసైటీ అధ్యక్షుడు అబ్బయ్యకు, నరసింహస్వామి సొసైటీ అధ్యక్షుడు కార్తీక్‌లకు బ్యాంక్ లావాదేవీల ద్వారా, నేరుగా పలుమార్లు డబ్బులు ఇచ్చాను. 6, 10 పాయింట్లలో క్వారీలు ఏర్పాటు చేసేందుకు గ్రామసభల ఖర్చులు కూడా నా జేబులోంచే పెట్టాను. తీరా చూస్తే ఆ క్వారీలను ‘సందీప్’ అనే వ్యక్తికి అప్పగించారని తెలిసి నేను దిగ్భ్రాంతికి గురై వారిని నిలదీశాను.”
“అప్పుడు వాళ్లు కొత్త నాటకమాడుతూ.. డీసీసీ అధ్యక్షుడు అశోక్ గారు ఆదేశించారని, మీకు 7, 9 పాయింట్లలోని క్వారీలు ఇస్తామని చెప్పారు. నేను ఆత్మహత్య చేసుకుంటానని ఏడవడంతో, అశోక్ గారిని కలవనివ్వకుండా తామే వెళ్లి మాట్లాడుతామని చెప్పారు. అందుకోసం నా డబ్బులతోనే అద్దె కారు ఇప్పించగా.. బాలకృష్ణ, అబ్బయ్యలు తిరిగి వచ్చి అశోక్ గారికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. నేను అప్పులు చేసి మరీ ములుగు కలెక్టర్ ఆఫీసు ముందే రూ. 38 లక్షల నగదును బాలకృష్ణ చేతికి ఇచ్చాను. 7, 9 క్వారీలు సబ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పిన బాలకృష్ణ.. డబ్బులు తీసుకున్నప్పటి నుండి నా ఫోన్ లిఫ్ట్ చేయడం బంద్ చేశాడు. చివరకు అబ్బయ్య వద్దకు వెళ్లి నిలదీస్తే.. బాలకృష్ణకు డబ్బులు ఇచ్చిన విషయం నిజమేనని అగ్రిమెంట్ కాపీ రాసి ఇచ్చాడు.”
నాపైనే రివర్స్ కేసులు.. ప్రాణాలు తీయాలని చూస్తున్నారు!
“అశోక్ గారికి అసలు డబ్బులు ముట్టాయా లేదా అని తెలుసుకోవడానికి రమణక్కపేట గ్రామ పెద్దలతో నేను మాట్లాడగా, సదరు నాయకులు నా వాయిస్‌ను దొంగతనంగా రికార్డ్ చేసి వాట్సాప్ గ్రూపులలో షేర్ చేశారు. అంతటితో ఆగకుండా బాలకృష్ణ మంగపేట పోలీసులకు నాపైనే తప్పుడు ఫిర్యాదు చేసి పోలీసులతో ఫోన్ చేయించాడు. నేను మంగపేట ఎస్సైగారికి నాకు జరిగిన అన్యాయం గురించి సవివరంగా ఏడ్చి చెప్పాను. నేను డయాలిసిస్ పేషెంట్‌ను అయినందున ఎస్పీ గారికి పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేస్తానని తెలిపాను. ఆ తరువాత ఏటూరునాగరం ఏఎస్పీగారు ఫోన్ చేయగా నేను స్వయంగా వెళ్లి కలిసి నాకు జరిగిన ఘోర వంచనను వివరించాను.”
“ఇంత జరిగినా ఇప్పుడు 7, 9 క్వారీలను కూడా ఇతరులకు అప్పగించి నన్ను నిలువునా ముంచాలని చూస్తున్నారు. అందుకే నేను జిల్లా కలెక్టర్ గారితో పాటు పలువురు ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాను. నా వద్ద డబ్బులు తీసుకుని ఇసుక రీచుల సబ్ కాంట్రాక్టు ఇవ్వకుండా నన్ను రోడ్డున పడేసిన బాలకృష్ణ, అబ్బయ్య, కార్తీక్‌లతో పాటు డీసీసీ అధ్యక్షుడు అశోక్ గారి పాత్ర కూడా ఇందులో స్పష్టంగా ఉన్నది. నేను సర్వస్వం కోల్పోయి, డయాలిసిస్ బెడ్‌పై బతుకు లాగుతున్నా. నాకు న్యాయం జరగకపోతే ములుగు జిల్లా కేంద్రంలోనే ఆత్మహత్య చేసుకోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు. ఉన్నతాధికారులు స్పందించి నన్ను ఆదుకోవాలి” అని బాధితుడు బెల్లకొండ వెంకటేశ్వర్ రావు తీవ్ర ఆవేదనతో విజ్ఞప్తి చేశారు.

