ఏసీబీ వలలో సైదాపూర్ మండల సర్వేయర్
భూ సర్వేకు రూ.25 వేలు లంచం డిమాండ్
రూ.10 వేలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు
కాకతీయ, కరీంనగర్ : భూ సర్వే నిర్వహించేందుకు లంచం డిమాండ్ చేసిన సైదాపూర్ మండల సర్వేయర్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో అతనికి సహకరించిన ఇద్దరు ప్రైవేట్ సహాయకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అవినీతి నిరోధక శాఖ తెలిపిన వివరాల ప్రకారం, సైదాపూర్ మండలం అమ్మన్‌గుర్తి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భూమికి సర్వే చేసేందుకు మండల సర్వేయర్ యెక్కలదేవి కుమారస్వామి రూ.25 వేల లంచం డిమాండ్ చేశాడు. ఇందులో భాగంగా గతంలో ఆన్‌లైన్ ద్వారా రూ.5 వేలు, ప్రైవేట్ సహాయకుడు వంగా విహిత్ రెడ్డి ద్వారా మరో రూ.10 వేలు తీసుకున్నాడు. మిగిలిన రూ.10 వేల కోసం శుక్రవారం ఫిర్యాదుదారుడిని సంప్రదించగా, అవినీతి నిరోధక శాఖ అధికారులు పక్కా ప్రణాళికతో వలపన్నారు. సర్వేయర్ సూచన మేరకు మరొక ప్రైవేట్ సహాయకుడు తీగల రాజేష్ లంచం డబ్బులు స్వీకరిస్తుండగా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.10 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు నిర్ధారణ కావడంతో సర్వేయర్ కుమారస్వామితో పాటు తీగల రాజేష్, వంగా విహిత్ రెడ్డిలను అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని కరీంనగర్‌లోని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.

