రైతుకు భరోసా ఎక్కడ?
పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలి : ‘ఏఐయూకేఎస్’ డిమాండ్
సింగరేణి మండల డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం
కాకతీయ,కారేపల్లి : రైతాంగ సమస్యలను తక్షణమే పరిష్కరించి, కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) డిమాండ్ చేసింది. సంఘం ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు శుక్రవారం సింగరేణి మండల డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐయూకేఎస్ ఖమ్మం డివిజన్ కార్యదర్శి గుగులోతు తేజ నాయక్ మాట్లాడుతూ.. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, రైతులకు అవసరమైన అన్ని రకాల విత్తనాలను పూర్తి సబ్సిడీపై అందించాలని కోరారు. రాష్ట్రంలో వరి, జొన్న, మొక్కజొన్న, చిరుధాన్యాలు, పప్పుధాన్యాల విత్తనాలు రైతులకు అవసరమైన మేరకు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 90 శాతం సబ్సిడీపై విత్తనాలు అందించాలనే నిబంధనను పక్కాగా అమలు చేయాలని, కారేపల్లి, కామేపల్లి మండలాల రైతులకు కూడా పూర్తిస్థాయిలో సబ్సిడీ ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పుల్లకాని సత్తిరెడ్డి, వడ్డే వెంకటేశ్వర్లు, బాలు నాయక్, రావుల నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

