బీఆర్ఎస్ మైనార్టీ జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఎస్కే గౌసుద్దీన్?
కాకతీయ, కారేపల్లి : ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ మైనార్టీ అధ్యక్ష పదవి రేసులో వైరా నియోజకవర్గం సింగరేణి మండలానికి చెందిన సీనియర్ నాయకుడు ఎస్కే గౌసుద్దీన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న ఆయన, అధిష్ఠానానికి అత్యంత నమ్మకమైన కార్యకర్తగా గుర్తింపు పొందారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఉద్యమ కాలంలో పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నేతృత్వంలో ఖమ్మం జిల్లాలో నిర్వహించిన పలు నిరసనలు, బహిరంగ సభల్లో గౌసుద్దీన్ క్రియాశీలకంగా వ్యవహరించారు. వైరా ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే ఆయనకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మద్దతుతో పాటు, వైరాకు చెందిన మదన్‌లాల్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. పార్టీ బలోపేతానికి నిరంతరం శ్రమిస్తున్న గౌసుద్దీన్‌కు జిల్లా మైనార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే, ఉమ్మడి జిల్లాలో మైనార్టీ వర్గాల్లో పార్టీ మరింత పటిష్టమవుతుందని ఆయన మద్దతుదారులు, అభిమానులు పార్టీ అధిష్ఠానాన్ని కోరుతున్నారు.

